![]() |
Christians and Munambam villagers |
మరోవైపు ‘‘మునంబం భూ సంరక్షణ సమితి’’ పేరుతో 175 రోజులుగా అక్కడ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ మండపాన్ని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సందర్శించారు.పార్లమెంట్ ఉభయ సభలూ వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించిన తర్వాత తాను నిరసనకారుల మండపాన్ని సందర్శిస్తానని రాజీవ్ చంద్రశేఖర్ గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు తాను ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ ఆందోళనకారులను కలుసుకున్నారు.
మరోవైపు రాజీవ్ చంద్రశేఖర్ మునంబం భూ సంరక్షణ సమితి నిరాహార దీక్షల స్థలికి చేరుకోగానే నిరసనకారులు ఆయన్ను ఘనంగా స్వాగతించారు. అక్కడి నుంచి వేలంకన్ని మాతా చర్చి ప్రాంగణం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ చర్చి వికార్ మరియు భూ రక్షణ సమితి నేతలు బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ని ఘనంగా స్వాగతించారు.
ఈ సందర్భంగా క్రైస్తవ నేతలు, భూ సంరక్షణ సమితి నేతలు బీజేపీకి ధన్యవాదాలు ప్రకటించారు. తమ కృతజ్ఞత మాటల్లో చెప్పలేనిదని పేర్కొన్నారు. న్యాయం కోసం తాము 174 రోజులుగా పోరాటం చేస్తున్నామని, తమకు బీజేపీ భరోసాగా వుందని వేలకంన్ని మాతా చర్చి ఫాదర్ ఆంటోనీ జేవియర్ తరాయి పేర్కొన్నారు. అయితే మునాంబం భూమిని వక్ఫ్ బోర్డు ఆస్తుల జాబితా నుంచి తొలగించి, తమ హక్కులను పునరుద్ధరించే వరకూ ఆందోళన మాత్రం కొనసాగుతుందన్నారు.
ఈ సందర్భంగా తమకు బీజేపీ ఏవిధంగా మద్దతిచ్చిందో ఒక్కొక్కరుగా సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా నినాదాలు, చప్పట్లు కొడుతూ బీజేపీకి, కేంద్ర మంత్రులు సురేష్ గోపి, కేంద్ర మాజీ మంత్రి జార్జ్ కురియన్ కి ధన్యవాదాలు ప్రకటించారు. ఈ సందర్భంగా స్వీట్లు కూడా పంచుకున్నారు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మునంబం తీర ప్రాంతంలో 404 ఎకరాల భూమి చుట్టూ మునంబం వక్ఫ్ భూ వివాదం తిరుగుతోంది. ఈ భూమిలో 600 కుటుంబాలు నివసిస్తున్నాయి, ప్రధానంగా లాటిన్ కాథలిక్ కమ్యూనిటీకి చెందిన క్రైస్తవులు మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన హిందువులు ఉన్నారు. ఈ కుటుంబాలు దశాబ్దాలుగా ఈ భూమిపై ఆధారపడి జీవిస్తున్నాయి. 1950లో నమోదైన వక్ఫ్ దస్తావేజును ఉటంకిస్తూ కేరళ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఈ భూమిపై హక్కులు పొందింది. అయితే ఈ భూమిపై చట్టబద్ధమైన హక్కులు తమవేనని, ఒకప్పుడు దాని నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ఫరూక్ కాలేజీ నుంచి దశాబ్దాల క్రితం కొనుగోలు చేశామని నిర్వాసితులు చెబుతున్నారు.