శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో మాంగల్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వేదపండితులు, ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రతి యేడు లాగే ఈ యేడు కూడా ఈ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తుల రామ నామ స్మరణతో భద్రాలచం వీధులన్నీ రామనామ మయంగా మారిపోయాయి.అధికారులు మిధిలా స్టేడియం ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. శ్రీరాముని కల్యాణోత్సవాన్ని అందరూ వీక్షించేందుకు అన్ని సెక్టార్లలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.వేసవి కావడంతో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీత కూడా పాల్గొన్నారు. సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో దేవస్థానం అధికారులు భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు, 200 క్వింటాళ్ల తలంబ్రాలను పంపిణీకి సిద్ధం చేశారు. ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలో భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సోమవారం నిర్వహించే పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచ్చేయనున్నారు.