యూపీలోని సహరాన్ పూర్ లోని ఘంటాఘర్ లో ఈద్ ప్రార్థనల తర్వాత ముస్లిం యువకులు పాలస్తీనా జెండాలతో కనిపించారు. అంతేకాకుండా పాలస్తీనాకి అనుకూలంగా కూడా నినాదాలు చేశారు. ఓ యువకుడు ఏకంగా గాజా అని రాసివున్న టీషర్టును ధరించాడు. వీటన్నింటికీ సంబంధించిన ఆధారాలు సీసీ టీవీలో నిక్షిప్తమై వున్నాయి.
సహరాన్ పూర్ లో నమాజ్ చేసిన తర్వాత యువకులు బయటికి వచ్చారు. ఘంటాఘర్ ప్రాంతంలో యువకులు గుమిగూడి పాలస్తీనా జెండాలను ఊపుతూ, అనుకూల నినాదాలు చేశారు. దీనిపై పోలీసులు కూడా స్పందించారు. దీనిపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. ఎవరెవరు వున్నారో సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తిస్తామని, వారిపై చర్యలు వుంటాయని తెలిపారు.
హర్యానాలో కూడా ఇదే తంతు...
ఇక.. హర్యానాలోని నూహ్ ప్రాంతంలో కూడా అచ్చు ఇదే విధంగా కనిపించింది. ఈద్ ప్రార్థనల అనంతరం కొందరు వ్యక్తులు పాలస్తీనా జెండాలతో కనిపించారు. పాలస్తీనాకు మద్దతుగా జెండాను, ప్లకార్డులను చేతులో పట్టుకొని, ఊరేగింపులా చేశారు. పాలస్తీనాలో శాంతి, సామరస్యాలు నెలకొనాలని అందరూ ప్రార్థించాలని కూడా పిలుపునిచ్చారు.
ఇక... ఇదే సమయంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి, నమాజ్ కి వచ్చారు. నమాజ్ తర్వాత పాలస్తీనాకు మద్దతుగా ఊరేగింపు చేశారు.
భోపాల్, సియోని ప్రాంతాల్లో కూడా...
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రంజాన్ ప్రార్థనల సందర్భంగా ముస్లింలు చేతులకు నల్ల బ్యాండులు కట్టుకొని భోపాల్, సియోనిలో ఈద్గా నమాజ్ కి హాజరయ్యారు.దీంతో పాటు ‘‘ఐ స్టాండ్ విత్ పాలస్తీనా’’ అంటూ నినాదాలిచ్చారు. దీంతో పాటు నెతన్యాహూ ఓ హంతకుడంటూ నినాదాలు కూడా చేశారు.
ఇక సియోనిలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఈద్ ప్రార్థనలు చేసేందుకు అక్కడికి వచ్చిన ముస్లింలు తమ చేతుల్లో వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా పోస్టర్లు పట్టుకున్నారు. అదే విధంగా పాలస్తీనా అనుకూల నినాదాలిస్తూ... నెతన్యాహూ ఓ హంతకుడంటూ నినాదాలిచ్చారు. అలాగే వక్ఫ్ బోర్డుకి మద్దతుగా నినాదాలు చేశారు.