నాగాలాండ్ లోని దిమాపూర్ నేషనల్ యూనివర్శిటీలో డాక్టర్ హెడ్గేవార్ పేరుతో కొత్త సెంట్రల్ లైబ్రరీ ప్రారంభమైంది. నాగాలాండ్ గవర్నర్ గణేషన్, యూనివర్శిటీ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రాంతంలో జ్ఞాన సంపద, పరిశోధనలో, మేధో పరమైన వృద్ధిని పెంపొందించడంలో ఓ మైలురాయిగా నిలుస్తుంది.పరిశోధన, అభ్యాస కేంద్రంగా ఈ లైబ్రరీ నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.
ఈ లైబర్రీలో 75 వేల పుస్తకాలున్నాయని, ఇది కేవలం డాక్టర్జీకి నివాళి అర్పించడమే కాకుండా విద్యార్థులను పండితులుగా మార్చడానికి ఉపయోగపడుతుందన్నారు. అలాగే విద్యా వనరులను సుసంపన్నం చేయడానికి కూడా ఈ లైబ్రరీ తోడ్పడుతుందన్నారు.
గ్రంథాలయాలు జ్ఞానానికి దీపాలుగా, జ్ఞాన నిలయాలుగా నిలుస్తాయని గవర్నర్ అన్నారు. అలాగే యువ మనస్సులను మేధోపరంగా తీర్చిదిద్దడంలోనూ, వారిలో మేధోపరమైన జిజ్ఞాసను పెంపొందించడంలో కీలకంగా వుంటాయన్నారు.
మరోవైపు సమాజం కోసం డాక్టర్ హెడ్గేవార్ చేసిన కృషిని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. జాతి ఐక్యత, సాంస్కృతిక మేలుకొలుపు కోసం నిస్వార్థంగా ఆయన జీవితాన్ని అంకితం చేశారన్నారు. పూర్తి అంకిత భావంతో హిందూ సంఘటన కోసం డాక్టర్జీ పనిచేశారన్నారు.
సంఘ వ్యవస్థాపకునిగా హెడ్గేవార్ జాతి నిర్మాణం, వ్యక్తి నిర్మాణం, సామాజిక సమరసతకి పునాదులు వేశారన్నారు.ఈ గ్రంథాలయానికి డాక్టర్జీ పేరు పెట్టడం అంటే స్వావలంబ భారత్ పట్ల ఆయనకున్న నిబద్ధతను మనం గుర్తు చేసుకోవడమేనని పేర్కొన్నారు.
మరోవైపు గ్రంథాలయాల చారిత్రాక పాత్రను ప్రస్తావిస్తూ గవర్నర్ నలంద, తక్షశిల వంటి పురాతన విద్యా కేంద్రాలను కూడా ప్రస్తావించారు. విద్య, విమర్శనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. విద్యార్థులు కేవలం లైబ్రరీ, విద్యా కార్యకలాపాల్లోనే మునిగిపోకుండా, జీవితం, విలువలు, జాతి నిర్మాణంపై కూడా దృష్టి సారించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.