బెంగళూరు వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయప్రతినిధి సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ హోసబళే విలేకరులతో మాట్లాడుతూ.. సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శాంతి, శ్రేయస్సుతో పాటు సామరస్యపూర్వకమైన, వ్యవస్థీకృత హిందూ సమాజాన్ని నిర్మించాలని సంకల్పించామని తెలిపారు. ఐకమత్యం, సార్వజనీన శ్రేయస్సును సాధించాలన్న లక్ష్యంతో హిందూ సమాజం చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదురైనా... సాధువులు, సంతులు, మహానుభావులు, మహనీయుల ఆశీస్సులు, వారి కృషితో ముందుకే సాగుతోందన్నారు.
దేశంలో కాలక్రమేణా పాతుకుపోయిన బలహీనతలను నిర్మూలించి, భారత్ ను పరమ వైభవ స్థితికి తీసుకురావడానికి 1925 లో డాక్టర్ హెడ్గేవార్ ఆరెస్సెస్ ను ప్రారంభించారని పునరుద్ఘాటించారు. దీని తర్వాత సంఘ కార్యానికి బీజాలు వేస్తూ.. దైనందిన శాఖ రూపంలో ఓ ప్రత్యేక కార్యపద్ధతిని తీసుకొచ్చి, వ్యక్తి నిర్మాణాన్ని చేశారన్నారు. శాశ్వతంగా వుండే సంప్రదాయ విలువలు, నీతికి అనుగుణంగా దేశాన్ని పునర్నిర్మించడానికి నిస్వార్థమైన తపస్సులాగా కొనసాగుతూనే వుందన్నారు.
అయితే.. డాక్టర్జీ జీవిత కాలంలోనే సంఘ్ దేశ వ్యాప్తంగా వ్యాపించిందని, అయితే.. సనాతన ధర్మం అన్న వెలుగులో వివిధ రంగాల్లో కాలానుగుణంగా గోళ్వాల్కర్ వ్యవస్థలను నిర్మాణం చేశారన్నారు. ఈ వంద సంవత్సరాల సంఘ ప్రయాణంలో దైనందిన శాఖలు, విలువలతో సంఘ్ సమాజం యొక్క అచంచలమైన ప్రేమ,విశ్వాసాన్ని, ప్రేమను సంపాదించుకుందని దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు. అలాగే స్వయంసేవకులు గౌరవాలు, అవమానాలు, ఇష్టాయిష్టాలకు అతీతంగా సమాజానికి ప్రేమ, ఆప్యాయత అన్న బలంతో అందర్నీ కలుపుకుపోతున్నారని తెలిపారు.
సంఘ శతాబ్ది సంవత్సరం సందర్భంగా సమాజంలోని పూజ్య సాధు సంతులను, సజ్జన శక్తిని గుర్తుంచుకోవడం తమ కర్తవ్యమని, వారి ఆశీర్వాదాలు, సహకారాలు గొప్ప బలాన్ని అందిస్తున్నాయని అన్నారు. భారత్ గొప్ప సంప్రదాయాలతో కూడిన పురాతన సంస్కృతి అని, ఈ అనుభవాల ఆధారంగా సామరస్య పూర్వకమైన సమాజాన్నినిర్మించడానికి ఆ పునాదులు, అనుభవ జ్ఞానం ఉపయోగపడుతుందన్నారు.
ధర్మాచరణ ద్వారా వచ్చే ఆత్మ విశ్వాసం, వ్యవస్ధీకృతమైన, సామూహిక జీవనం ఆధారంగానే హిందూ సమాజం తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలదన్న సూత్రాన్ని సంఘ్ విశ్వసిస్తుందని తెలిపారు. అందుకే అన్ని రకాల వివక్షలను రూపుమాపి, పర్యావరణ అనుకూల జీవన శైలి అన్న మూలాలపై, విలువలతో కూడిన కుటుంబాలను ప్రోత్సహించే ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలని సంకల్పించామని, అలాగే పౌర విధులను నిర్వర్తించే, సామరస్యపూర్వక పద్ధతులను అనుసరించే సమాజాన్ని కూడా నిర్మించాలని సంకల్పించుకున్నామని తెలిపారు. ఇలాంటి సమాజమే అన్ని సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తుందన్నారు.
ఇక.. పై అంశాలతో పాటు ఈ క్రింది విషయాలను కూడా హోసబళే ప్రస్తావించారు.
- అక్టోబర్ 2, విజయ దశమి : ప్రధాన కార్యక్రమాల్లో ఇది ప్రథమమని తెలిపారు. సరసంఘచాలక్ స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే లక్ష శాఖలే లక్ష్యంగా సాగడం, గరిష్ట సంఖ్యలో బస్తీలను, ఇళ్లకు చేరుకోవడమే లక్ష్యమని ప్రకటించారు.
- సమాజ సమ్మేళనాలు - హిందూ సమ్మేళనాలు : మండల స్థాయిలో వివక్షత లేని బలమైన సామరస్యపూర్వక సమాజం అవసరాన్ని నొక్కి చెప్పడానికి ఇవి నిర్వహిస్తామని తెలిపారు. అలాగే పంచపరివర్తన్ అభ్యాసాన్ని వారికి వివరించి, నిత్య జీవితంలో ఆచరించడం ఎలా అన్న దానిపై కూడా వివరిస్తామన్నారు.
- సామాజిక సద్భావనా సమావేశాలు : స్వయంసేవకుల కృషి కారణంగా సామాజిక ఐక్యత బలోపేతం అయ్యింది. సమాజమంతా ఐకమత్యంగా వుండేలా చూసుకోవడమే ఈ సమావేశాలు లక్ష్యం. ఈ సమావేశాలు ఆధ్యాత్మిక సంపన్నత, సామరస్యంతో పాటు వ్యసనాల నుంచి విముక్తి, పరిశుభ్రతతో కూడిన పరిసరాలపై దృష్టి పెడతాయి.
- ప్రముఖ్ జన గోష్టి : జాతీయ అంశాలపై ఈ సమావేశం దృష్టి పెడుతుంది. తప్పుడు కథనాలు దేశంలో వ్యాప్తి అవుతున్నాయి. చాలా సంవత్సరాలుగా జరుగుతున్న వీటిని సరిచేయాల్సి వుంది. కథనాన్ని మార్చాల్సిన అవసరం వుంది.
- మోహన్ భాగవత్ ప్రసంగాలు : నాలుగు నగరాల్లో తన ప్రసంగాల ద్వారా సరైన కథనాలను, వాస్తవ కథనాలను వ్యవస్థీకృతం చేస్తారు.
- శాఖ విస్తరణ : సెప్టెంబర్ 2025 నుంచి అక్టోబర్ 2026 వరకు లక్షకు పైగా ప్రదేశాలలో వారం పాటు శాఖలు నిర్వహించబడతాయి.
- కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు : కళాశాల విద్యార్థులు, యువత కోసం పంచ పరివర్తన్, సేవ, జాతీయతపై దృష్టి సారిస్తాం. అలాగే వీటి ద్వారా వారు సమాజానికి ఉపయోగపడేలా, భారతదేశం సుసంపన్నం కావడానికి ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన. చేస్తామని దత్తాత్రేయ హోసబళే తెలిపారు.
అలాగే ఈ మీడియా సమావేశంలో దత్తాత్రేయ హోసబళే వక్ఫ్ బిల్లు, ఔరంగజేబు వివాదంపై కూడా స్పందించారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ జేపీసీని ఏర్పాటు చేసిందని, ఇది సరైన దిశలోనే పనిచేస్తోంది.
- ఇక... ఔరంగజేబు గురించి చారిత్రక వాస్తవాలను అంగీకరించాలని అన్నారు.ఔరంగజేబు పేరుపై వున్న రోడ్డుని కలామ్ రోడ్డుగా మార్చడం వెనుక వున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. భారత్ లో దారా షికోహ్ ను ఎందుకు ఐకాన్ గా చేయలేదు. భారత నైతిక విలువలకు వ్యతిరేకంగా వున్న వారిని ఎందుకు కీర్తిస్తున్నారు. భారత దేశ సంస్కృతి కోసం, అభ్యున్నతి కోసం పాటుపడేవారిని గౌరవించుకోవాలి. అంతేగానీ భారతీయ విలువలను వ్యతిరేకించేవారిని, మూలాలను ప్రశ్నించే వారిని కాదు’’ అని హోసబళే అన్నారు.
- ఇక... మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగంలో భాగం కాదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ పై మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ఎన్నైనా వ్యాఖ్యలు చేయవచ్చు గానీ.. దానిపై ముసాయిదా కూడా లేదని, దీనిపై సంఘ్ వ్యాఖ్యానించదని తేల్చి చెప్పారు.
- ఇక.. మణిపూర్ అంశంపై కూడా స్పందించారు. ఈ అంశానికి సంబంధించి సమస్య పరిష్కారాలను, సూచనలను అందించిందని, కానీ నిర్దిష్టమైన డిమాండ్లను మాత్రం చేయలేదన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అయితే పరిస్థితులు మెరుగుపడడానికి తగిన ఆశాభావం వుందన్నారు.
- అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది ఆరెస్సెస్ విజయం కాదని, అది సమాజం సాధించిన విజయమని అభివర్ణించారు. జాతీయ ఐక్యతను, సమగ్రతను బలోపేతం చేసిందన్నారు. హిందువు అనేది కేవలం మతపరమైనది కాదని, జాతీయవాద సాంస్కృతిక, ఆధ్యాత్మిక గుర్తింపు అని వివరించారు. హిందూ సమాజంలో చైతన్యం కనిపిస్తోంది కానీ... అంటరానితం లాంటి విషయాల్లో మరింత దిద్దుబాటు అవసరం అని అభిప్రాయపడ్డారు.
- ఇక కులాంతర వివాహాలపై మాట్లాడుతూ.. వీటిని సంఘ్ ఎప్పుడూ మద్దతిస్తారని అన్నారు.భారత్ లో జన్మించిన వారు హిందువులని, శాఖకు హాజరయ్యే వారు కులం అన్న దానికి అతీతంగా ఎదుగుతారన్నారు.
- ఇక.. అక్రమ వలసలపై కూడా స్పందించారు. దీని విషయంలో మాత్రం సరైన విధానాన్ని అనుసరించాలని నొక్కి చెప్పారు. అక్రమ చొరబాట్లకు సంబంధించిన రిపోర్టులు వున్నాయని, దీనికి సంబంధించి చట్టాలను, నిబంధనలను అమలు చేయడం మాత్రం ప్రభుత్వాలదే బాధ్యత అని స్పష్టం చేశారు.
సంఘ కార్యకలాపాల్లో మహిళలు పాల్గొనడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ఆరెస్సెస్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో మహిళలు చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ ప్రబోధన్ గానీ, కుటుంబ విలువలు గానీ మహిళల భాగస్వామ్యం లేనిదే బలోపేతం కావన్నారు. అయితే... ప్రతి పనిలో నిర్ణయం తీసుకునే ప్రక్రియలో మహిళల భాగస్వామ్యాన్ని నిర్ధారించాల్సింది కేవలం సంఘ్ మాత్రమే కాదని, మొత్తం సమాజం నిర్ధారించాలన్నారు. సామాజిక అభివృద్ధిలో వారి పాత్రను నొక్కి చెప్పాలని హోసబళే అన్నారు.