అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్రస్వామి పారువేట ఉత్సవం సందర్భంగా హిందూ భక్తులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు హైందవ సహోదరులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు.
అన్ని జిల్లా కేంద్రాలలో మఠాధిపతులు, స్వామీజీలు, వీహెచ్‌పీ నాయకులు, కార్యకర్తలు, హైందవ సోదరసోదరీమణులు కాషాయ జెండాలను చేతబట్టుకొని హిందువులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, హిందువులు జరుపుకునే పండుగలు, ఉత్సవాలు, వేడుకలు, ఊరేగింపులపై దాడులను మూకుమ్మడిగా ఖండించారు. నిరసన కార్యక్రమంలో భాగంగా, వీహెచ్‌పీ దక్షిణాంధ్ర ప్రాంత విశేష్ సంపర్క్ ప్రముఖ్ సీతారామయ్య ఆధ్వర్యంలో ప్ర్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు.
కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో వీహెచ్‌పీ నాయకులు, కార్యకర్తలు, హిందూ సహోదరులు పెద్ద ఎత్తున పాల్గొని వీరభద్రస్వామి ఉత్సవం పై దాడి చేసిన వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఆలయం పారువేట ఉత్సవం పై దాడి చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. దాడికి పాల్పడినవారిని గుర్తించి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఈమని బలరామ్ మాట్లాడుతూ, ఊరేగింపు పై దాడి జరుగుతున్నా స్పందించకుండా, ఏకపక్షంగా వ్యవహరిస్తూ భక్తులపైనే కేసులు పెట్టిన పోలీసుల పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వీరభద్రస్వామి ఊరేగింపుపై జరిగిన దాడిని హైందవ సమాజం మూకుమ్మడిగా ఖండిస్తోందన్నారు. హిందువులంతా ఐక్యంగా ఉండి హైందవ సంప్రదాయాలను కాపాడాలని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా విశ్వహిందూ పరిషత్ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిరసన ధర్నా నిర్వహించారు. రాయచోటిలో శోభాయమానంగా వీరభద్రస్వామి ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్న హిందూభక్తులపై మతఛాందసవాదులు దాడికి దిగడం గర్హనీయమని శ్రీకాకుళం జిల్లా వీహెచ్‌పీ అధ్యక్షులు లోకనాథం ఆనందరావు మండిపడ్డారు. రాయచోటిలో పోలీసులు వ్యవహరించిన తీరుని ఆయన తప్పుబట్టారు. దాడికి గురైన బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టడాన్ని అమానుషచర్యగా అభివర్ణించారు. కేసులను ఉపసంహరించి అలసత్వం వహించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాయచోటి తరహా ఘటనలు మరలా చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
హిందువులపై దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలని వీహెచ్‌పీ ఆధ్వర్యంలో శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మిట్ట ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ నాయకులు మాట్లాడుతూ, రాయచోటిలో ఈ నెల4న హిందువులపై, శ్రీ వీరభద్రస్వామివారి ఉత్సవం పై జరిగిన దాడిని ఖండించారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్ వద్ద స్థానిక విశ్వహిందూ పరిషత్ నేతల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి పారువేట ఉత్సవ ఊరేగింపులో హిందువుల మీద జరిగిన దాడికి మరియు తప్పుడు కేసులు పెట్టిన ఎస్.ఐ.ని సస్పెండ్ చేయాలని వీహెచ్‌పీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పూజ్య స్వామీజీలు, వీహెచ్‌పీ ప్రాంత సంఘటన మంత్రి శ్రీనివాస రెడ్డి, ప్రాంత కోశాధికారులు దుర్గా ప్రసాద్ రాజు, వీహెచ్‌పీ విజయవాడ మహానగర్ అధ్యక్షులు సాన శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రాఘవరాజు, వైఎస్ఎస్ ప్రసాద్ సహా పలువురు కార్యకర్తలు, హిందూ బంధువులు పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా తరలివెళ్లి వీహెచ్‌పీ నేతలు మెమోరాండం సమర్పించారు.
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్రస్వామి ఉత్సవంలో భక్తులపై మతోన్మాదుల దాడి అత్యంత దురదృష్టకరమని వీహెచ్‌పీ నేతలు అన్నారు. హిందూ భక్తుల మేళతాళాలను నిలిపివేయడం, భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ఈ సందర్భంగా వీహెచ్‌పీ నేతలు ఖండించారు. భక్తుల రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లి విజ్ఞాపన పత్రాన్ని అందించారు. వీహెచ్‌పీ నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో హిందూ సమాజం పెద్ద ఎత్తున పాల్గొంది. రాయచోటి ఘటనకు వ్యతిరేకంగా ఏలూరు జిల్లా కేంద్రంలో కూడా హిందూ బంధువులు సంఘటితంగా నిరసన తెలియజేశారు. స్థానిక వీహెచ్‌పీ నేతల ఆధ్వర్యంలో హిందువుల ఐక్యత వర్థిల్లాలి, హిందూ హిందూ బంధూ బంధూ వంటి ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఏలూరు పట్టణంలో ధర్నా నిర్వహించారు. హిందువులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్యరవికుమార్ పాల్గొన్నారు. రాయచోటిలో వీరభద్రస్వామి పారువేట ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న హిందూ సమాజం పై ముస్లింలు చేసిన దాడిని ఆయన ఖండించారు. హిందూ భక్తులపై అకారణంగా లాఠీఛార్జ్ చేసిన స్థానిక ఎస్.ఐ.ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విశ్వహిందూపరిషత్ పిలుపుమేరకు కాకినాడ పట్టణంలోని మహిళాలోకం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొంది. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనంటూ నినదిస్తూ హిందూ సోదరులు ర్యాలీ చేపట్టారు. హిందూ భక్తులపై రాయచోటి పోలీసులు పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూడా వీహెచ్‌పీ పిలుపునందుకొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందువులపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. హిందువులు ఊరేగింపు చేస్తుండగా అన్యమతస్థులు దాడి చేయడాన్ని ఖండించారు. హిందువులపై దాడులను, అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది హైందవ సోదరసోదరీమణులు పాల్గొని రాయచోటి దాడి ఘటన బాధితులకు సంఘీభావం తెలియజేశారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా కేంద్రంలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో హిందూ సమాజం నిరసన ధర్నా చేపట్టింది. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో రాయచోటి ఘటన పై మెమోరాండం అందించారు.
రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి ఊరేగింపు పై జరిగిన అన్యమతస్తుల దాడిని ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ విశాఖ మహానగర్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు స్వామీజీలు, వీహెచ్‌పీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో, అనకాపల్లి జిల్లా కేంద్రంలో సైతం నిరసన కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టారు. రాయచోటిలో దాడి చేసిన వారిని అరెస్టు చేయాలనే డిమాండ్‌తో తిరుపతి పట్టణంలో కూడా నిరసనలు తెలియజేశారు. హిందువులపై అక్రమంగా కేసులు పెట్టిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాయచోటి శ్రీవీరభద్ర స్వామి ఆలయం పారువేట ఉత్సవం సమయంలో అరెస్టై కడప కేంద్రకారాగారంలో ఉన్న హిందూ బంధువులను పరామర్శించినట్లు, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు.పారువేట ఉత్సవం పై దాడి చేసిన మతోన్మాదులను తక్షణమే గుర్తించి, వారిని కఠినంగా శిక్షించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, హిందూ సమాజం మునుపటిలా నిద్రావస్థలో లేదనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా సందేశం పంపాలని ఈ సందర్భంగా వక్తలు తెలియజేశారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సైతం వీహెచ్‌పీ పిలుపుని అందుకొని హిందూ సమాజం నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. రాయచోటి ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో స్థానిక ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందించారు. రాయచోటిలో సైతం ధర్నా చేపట్టి అనంతరం స్థానిక కలెక్టరేట్ కార్యాలయానికి ర్యాలీగా తరలివెళ్లి హైందవ సోదరులు వినతి పత్రాన్ని సమర్పించారు. రాజమండ్రిలో సైతం నిరసన ర్యాలీ జరిగింది. రాయచోటిలో హిందువులపై జరిగిన దాడులను వ్యతిరేకిస్తూ నంద్యాలలో సైతం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతపురం, రాజమండ్రిలో సైతం నిరసన ర్యాలీలు జరిగాయి.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో 2025 మార్చి 4న వీరభద్ర స్వామి ఆలయం పారువేట ఉత్సవంలో భాగంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా ముస్లింలు హిందువులపై దాడి చేశారు. ఆ సందర్భంగా పోలీసులు ముస్లిములను అదుపు చేయడంలో విఫలమయ్యారు. హిందూ భక్తులపైన మాత్రం లాఠీచార్జి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రతీ యేడాదిలానే ఈ సంవత్సరం కూడా హిందువులు ఉత్సవం జరుపుకుంటుంటే ముస్లిములు దాడి చేయడం, దానికి పోలీసులు భద్రత కల్పించకపోవడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండించిన విషయం మనకు తెలిసిందే.
హిందువులపైన, వారి ఉత్సవాలపైన ముస్లిములు దాడులు చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కాదు. 2024లో చిత్తూరు జిల్లా వి.కోటలో, కృష్ణా జిల్లా పెడనలోనూ హిందువుల మీద, వారి ఉత్సవాల మీదా ముస్లింలు దాడులు చేసారు. మందబలంతో విరుచుకుపడిన ముస్లిములు కేవలం హిందువుల పైనే కాకుండా పోలీసుల పైన, పోలీస్ స్టేషన్ల పైన కూడా దాడులు చేసారు. అయినా పోలీసులు వారిపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షించారు. దాడులు చేసిన వారి మానసిక స్థితిని పోలీసులు గుర్తించకపోగా, దాడులు జరిగిన ప్రతిసారీ హిందువులనే బాధ్యుల్ని చేయడం విచారకరం.
మొత్తంగా, వీరభద్రస్వామి ఊరేగింపుపై జరిగిన దాడిని హైందవ సమాజం మూకుమ్మడిగా ఖండిస్తోంది. ఇందులో భాగంగానే జరిగిన సంఘటనపై జిల్లాల కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికీ మెమొరాండం చేరేలా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలియజేసింది. వీహెచ్‌పీ పిలుపుమేరకు హిందువులంతా ఐక్యంగా తరలివచ్చి నిరసన కార్యక్రమాలలో పాల్గొని హైందవ సంప్రదాయాలను కాపాడుకునేందకు నడుంబిగించడం అభినందనీయం.