నాగపూర్ హింసాకాండ వెనుక వున్న ముఖ్య సూత్రధారి (మాస్టర్ మైండ్) ఫహీమ్ షమీమ్ ఖాన్ (38) అరెస్ట్ అయ్యాడు. మైనారిటీస్ డెమోక్రెటిక్ పార్టీ లో నాయకుడిగా వున్నాడు. ఈ నెల 17 న నాగపూర్ లో చెలరేగిన హింసకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు పేర్కొన్నారు.
గణేష్ పేట్ పోలీసు స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో ఫహీమ్ పేరును కూడా పోలీసులు చేర్చారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే అరెస్టయ్యాడు. అంతేకాకుండా ఫహీమ్ షమీమ్ ఖాన్ ఫొటోను కూడా పోలీసులు విడుదల చేశారు. దీంతో పాటు హింస చెలరేగడానికి కొన్ని క్షణాల ముందు రెచ్చగొట్టే ప్రసంగం చేసిన వీడియోను కూడా పోలీసులు సంపాదించారు.
అల్లర్లకు ఫహీమ్ ఖాన్ కుట్ర పన్నాడని, దాదాపు 100 మందిని ఇందు కోసం సమీకరించాడని, చివరికి హింసకు దారి తీసిందని పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అలాగే గణేష్ పేట్ పోలీసుల ముందే రెచ్చగొట్టే నినాదాలు చేసిన వీడియో కూడా లభించినట్లు తెలుస్తోంది. అలాగే పుకార్లను వ్యాప్తి చేశాడని కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.
ఫహీమ్ షమీమ్ ఖాన్ యశోధర నగర్ లోని సంజయ్ బాగ్ కాలనీలో వుంటాడు. MDP (మైనారిటీస్ డెమోక్రెటిక్ పార్టీ) నగర అధ్యక్షుడిగా వున్నాడు. మరోవైపు పోలీసులు ఈ నెల 21 వరకూ పోలీసు కస్టడీకి తరలించారు.
మరోవైపు ఈ హింసాకాండపై నాగపూర్ డీసీపీ నికేతన్ కదమ్ వివరించారు.‘‘అకస్మాత్తుగా ఓ వీధి నుంచి 100 మంది గుంపు వచ్చేసింది. ఆయుధాలు, పెట్రోల్, కర్రలు పట్టుకొని వచ్చారు. వారిని వెనక్కి పంపడానికి ప్రయత్నాలు చేశాను. వారిని ఆపడానికి ప్రయత్నాలు చేశారు. కొందరు వెనక్కి తగారు. కానీ.. ఒకడి వద్ద గొడ్డలి వుంది. దీంతో ముందుకు వచ్చి, దాడి చేశాడు. దీంతో నా చేతికి తీవ్రంగా గాయమైంది. కానీ.. అదృష్టవశాత్తూ నా బృందంలోని వారెవ్వరికీ గాయాలు కాలేదు. అయితే రాళ్లు రువ్వారు. దీంతో కొందరు అధికారులు గాయపడ్డారు. హింసా కాండకి పాల్పడిన వారందర్నీ గుర్తిస్తాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నా ఆరోగ్యం గురించి సీఎం ఫడ్నవీస్ వాకబు చేశారు. నాగపూర్ పోలీసులను మెచ్చుకున్నారు. మాలో మరింత ధైర్యం వచ్చింది. మరింత కష్టపడి పనిచేస్తాం’’ అని డీసీపీ నికేతన్ కదమ్ తెలిపారు.
Source: vskts