యూపీలో ఘోరం జరిగింది. బీజేపీ కీలక నేత గుల్ఫామ్ సింగ్ యాదవ్ పై దుండగులు విష ప్రయోగం చేసి చంపేశారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి, కడుపులోకి విషపూరిత పదార్థాన్ని పంపారు.ఈ సమయంలో గుల్ఫాన్ సంభాల్ జిల్లా దఫ్తారా గ్రామంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే దుండగులు విష ప్రయోగం చేశారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే లోపే దుండగులు బైక్ పై పరారయ్యారు.
ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం తన నివాసానికి అతి దగ్గర్లో గుల్ఫామ్ సింగ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ముగ్గురు వ్యక్తులు అతని వద్దకు వచ్చారు. ఆయన్ను మాటల్లో పెట్టేశారు. మరో వ్యక్తి దీనిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. మరో ఇద్దరు గుల్ఫామ్ దగ్గరే కూర్చున్నారు. సంభాషణలో పెట్టారు. ఐదు నిమిషాల తర్వాత వారిలో ఒకడు అకస్మాత్తుగా కడుపులోకి విషపూరిత పదార్థాన్ని ఎక్కించాడు. ఈ సమయంలో యాదవ్ పరిగెత్తారు. క్షణాల్లోనే కుప్పకూలిపోయారు. ప్రాణాలను కాపాడడానికి ఆస్పత్రికి తరలించాం. మధ్యలోనే మరణించారు.’’ అని తెలిపారు.
ఇక... గుల్ఫామ్ సింగ్ కుమారుడు దివ్య ప్రకాష్ కూడా స్పందించారు. తన తండ్రి స్పృహ కోల్పోయే ముందు దాడి చేసిన వారిని గుర్తించారని కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ హత్య ఎవరు చేశారో తమకు పక్కాగా తెలుసని, తన తండ్రి వారి పేర్లను కూడా తమతో చెప్పాడని పేర్కొన్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు పోలీసులు కూడా ఈ విషయంపై స్పందించారు. గుల్ఫాన్ పై విష ప్రయోగం జరిగిందని ధ్రువీకరించారు. ఈ హత్య వెనుక రాజకీయ కుట్రలున్నాయన్న అనుమానాలు వున్నాయన్నారు.
ఇక... యాదవ్ కడుపులో చిన్న పుండు వుందని, దాని చుట్టూ వున్న చర్మం నీలం రంగులోకి మారిపోయిందతని, విష ప్రయోగం జరిగిందనడానికి ఇదే బలమైన సాక్ష్యమని వైద్యులు అంటున్నారు. మరోవైపు ఓ సూది, హెల్మెట్ ను ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకుంది. కచ్చితమైన నివేదిక కోసం ఫోరెన్సిక్ నివేదికల కోసం చూస్తున్నారు.
గుల్ఫామ్ సింగ్ యాదవ్ (65) యూపీలో ప్రసిద్ధమైన బీజేపీ నాయకుడు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం వుంది. అయితే.. తొలినాళ్లల్లో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ బాధ్యతలు నిర్వర్తించారు. బదౌన్ ప్రాంతంలో 1976 లో సంఘ్ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత 2004 ఉప ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ పై పోటీకి దిగారు.ఆ తర్వాత పార్టీలో రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యునిగా, బదౌన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అలాగే యూపీ వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యునిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.