జుమ్మా అల్విదా, ఈద్ ప్రార్థనల విషయంలో యూపీ పోలీసులు అత్యంత కఠిన వైఖరి తీసుకున్నారు. రోడ్లపై ఎవరైనా నమాజ్ చేస్తూ కనిపిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.
అంతేకాకుండా వారి పాస్ పోర్టును, డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఈదుల్ ఫితర్ ప్రార్థనల కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని మీరట్ పోలీసులు ప్రకటించారు. ఈద్గా మైదానం, మసీదులో తప్ప మరెక్కడా నమాజ్ చేయవద్దని ముస్లింలకు సూచించామని తెలిపారు.
ఈ ఆంక్షలను కాదని ఎవరైనా రోడ్లపై నమాజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు వుంటాయన్నారు. వారి పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తామని, కేసులు పెడతామని ప్రకటించారు. గతేడాది నియమాలను ఉల్లంఘించి, నమాజ్ చేసిన 200 మందిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకున్నామని పోలీసులు గుర్తు చేస్తున్నారు.
నమాజ్ చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు.
భదత్రా బలగాలను కూడా మోహరించామన్నారు. డ్రోన్లను వినియోగిస్తామని, సీసీ టీవీలను కూడా భద్రతా ఏర్పాట్లలో భాగంగా వుంచుతామని మీరట్ ఎస్పీ ఆయుష్ విక్రమ్ తెలిపారు. అధికారుల అనుమతి లేకుండా రోడ్లపై ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదన్న ప్రభుత్వ నియమాలను కచ్చితంగా అమలు చేస్తామని, నియమాలను ఉల్లంఘించిన వారిపై మాత్రం చట్టపరంగా కఠిన చర్యలు వుంటాయని ప్రకటించారు.