(సామాజిక సమరసత వేదిక భాగ్యనగర్ సంభాగ్)
పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా భాగ్యనగర్, సికింద్రబాద్ విభాగ్ల మహిళా సమ్మేళనం మార్చి 23న కేశవ మెమోరియల్ కళాశాలలో ఘనంగా జరిగింది. భాగ్యనగర్ సంభాగ్ 11 జిల్లాల నుండి 225 మంది మహిళలు, 80 పురుషులు, 60 మంది చిన్నారులు సహా మొత్తం 365 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం, శ్రీమతి మమత బాల శేఖర్ అతిథులను ఆహ్వానించగా దీప ప్రజ్వలనతో ప్రారంభమై ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది.
ముందుగా ఉపాధ్యాయురాలు శ్రీమతి రాధిక మాట్లాడుతూ మహారాష్ట్రలోని చండి అనే ఒక మారుమూల గ్రామంలో మేకలు, గొర్రెలు మేపుకునే సామాన్య కుటుంబంలో అహల్యాబాయి జన్మించిందని, అమెకు మరాఠా సామ్రాజ్యానికి వెన్నెముక అయిన సుబేదార్ మల్హార్ రావు కుమారుడు ఖండేరావుతో 8 ఏళ్లకే వివాహం జరిగిందని తెలిపారు. అంతటి చిన్న వయస్సు నుంచే అహల్యాబాయి మామగారు మల్హార్ రావు ఆమెకు అన్ని అంశాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ఆమెకు సంబంధించిన జీవిత విశేషాలు కొన్నిటిని వివరించారు.
అనంతరం R-వాయిస్ యూట్యూబ్ నిర్వాహకురాలు శ్రీమతి నవత మాట్లాడుతూ నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రిలలో అహల్యాబాయి ధర్మసత్రాలు కట్టించి యాత్రికులకు వసతి కల్పించారని, జ్యోతిర్లింగాలను పునః ప్రతిష్ట చేశారని, దేశంలోని పలు పుణ్యక్షేత్రాలలో ధర్మసత్రాలు తదితర సౌకర్యాలను అభివృద్ధి చేశారని, 100కు పైగా దేవాలయాలను పునర్నిర్మించారని చెప్పారు. వీటిలో ఒకటి తెలంగాణలోని ఇందూరు జిల్లాలో ఉన్న కందకుర్తి కూడా ఉందన్నారు.
ఆ తరువాత అహల్యాబాయి హోల్కర్ "పాలన - అభివృద్ధి పనులు" అంశం మీద కేశవ మెమోరియల్ విద్యాసంస్థల లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వాణి ప్రసంగిస్తూ అహల్యాదేవి మద్దతు వల్లనే వాణిజ్య వ్యాపారాలు వర్థిల్లాయని, ఆర్థికంగానే కాక తన రాజ్యాన్ని సాంస్కృతిక కేంద్రంగాను అభివృద్ధి చేశారని వివరించారు. ఈ మహారాణి చేనేత వృత్తులవారికి తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మహేశ్వర్ చీరలను తయారు చేయించారని, రైతులకు అనుకూలంగా ప్రత్యేక చట్టాలు చేసి ప్రతి ఒక్కరి మన్ననలు పొందారని అన్నారు. హిందువులలో ఐక్యతను సాధించటంపై దృష్టి పెట్టి హిందూ ఐక్యత వల్లనే దేశం సుభిక్షంగా మనగలదని అన్నారు. ముస్లింలు హిందూ దేవాలయాలను నేలమట్టం చేసిన సందర్భాలు దృష్టికి వచ్చినప్పుడు ఆలయాలను ధ్వంసం చేయకుండా మసీదులు నిర్మాణం చేసుకోలేరా? అని అహల్యాబాయి చాలా బాధపడేవారని, హిందువులకు ఎంతో పవిత్రమైన దేవాలయాలను వారు కూల్చడం వెనుక ఉన్న దురుద్దేశాన్ని ఆమె ప్రశ్నించేవారని అన్నారు. దేశంలోని రాజులందరూ కలిసికట్టుగా పనిచేస్తే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఆమె ఆశించేవారని అన్నారు.
తర్వాత రెండవ కాలాంశం సామాజిక సమరసత మల్కాజిగిరి జిల్లా మహిళా విభాగం కన్వీనర్ శ్రీమతి నిర్మల అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్రను తెలిపే పాటతో మొదలైంది.
సామాజిక సమరసత తెలంగాణ ప్రాంత మహిళా విభాగం కన్వీనర్, ప్రభుత్వ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రుక్మిణి అహల్యాబాయి హోల్కర్పై రాసిన కవితను పంచుకుని కేవలం సమరసత అనేది మాటలకే పరిమితం కాకుండా మనమందరం ఆచరించి చూపాలని, మార్పు మన ఇంటి నుండే మొదలవ్వాలని, మన ఇంట్లో జరుపుకునే పండుగలకు అందరినీ ఆహ్వానించి ఒకరు ఎక్కువ కులం, ఒకరు తక్కువ కులం అనే భావనను మన మనస్సులో నుండి చెరిపివేయాలని పిలుపునిచ్చారు. అహల్యాబాయి హోల్కర్ లాంటి చరిత్రను సమాజంలోకి తీసుకుని వెళ్లాలన్నారు. మహిళా దినోత్సవం లాంటివి ఇప్పుడు వచ్చాయని, అయితే హిందూ సంస్కృతి మహిళకు ఎప్పటి నుండో ప్రధాన స్థానం కల్పించిందన్నారు. 300 సంవత్సరాల క్రితమే పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ అహల్యబాయ్ హోల్కర్ ఆదర్శంగా నిలిచారని, వారిని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. మన పిల్లలకు పాఠశాల ద్వారా విద్య అందుతుంది కానీ, సంస్కారం ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని హితవు చెప్పారు. చిన్నతనం నుండే అందరు సమానమే అనే భావనతో పిల్లలను మనం పెంచాలన్నారు. అన్ని కులాలకు చెందిన చిన్నారులకు కుమారి పూజ లాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో సమానత్వ భావాన్ని సామాజిక సమరసత తీసుకుని వెళుతున్నదని తెలియజేశారు.
సామాజిక సమరసత తెలంగాణ ప్రాంత అధ్యక్షులు శ్రీ ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో సామాజిక సమరసత వేదిక ద్వారా జరిగిన కార్యక్రమాలను తెలియజేశారు. కార్యక్రమం చివరన సామాజిక సమరసత అఖిల భారత కళా విభాగం కన్వీనర్ - తెలంగాణ ప్రాంత కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ కుటుంబం గొప్పతనం - దేశ ప్రగతి అనే అంశాల మీద మాట్లాడుతూ మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని, భారతదేశాన్ని ప్రపంచం మొత్తం గౌరవించటానికి గల కారణం మన ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థేనని అన్నారు. ఇటీవల జరిగిన మహాకుంభమేళా సామాజిక సమరసతకు ప్రతీక అంటూ ఈ వేడుక విదేశీయులను కూడా ఆకర్షించిందని తెలిపారు. మన పిల్లల్లో చిన్నప్పటి నుండే దేశభక్తిని పెంపొందించాలని, భువనేశ్వరి, జిజియా మాత వంటి మాతృమూర్తులు మనకు ఆదర్శమని అన్నారు.
ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి సమతా మూర్తుల చిత్రపటాలు, కరపత్రాలు అందచేశారు.
సామాజిక సమరసత వేదిక తెలంగాణ ప్రాంత మహిళా విభాగం సహ కన్వీనర్ శ్రీమతి నందాదేవి శాంతి మంత్రంతో వందన సమర్పణ చేశారు.