హైదరాబాద్: సుప్రసిద్ధ చిలుకూరు దేవాలయం ప్రధానార్చకులు రంగరాజన్ గారిపై జరిగిన హత్యాయత్నాన్ని విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్రంగా ఖండించింది. అమానుషంగా ఈ దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మీడియా ప్రకటన ద్వారా డిమాండ్ చేసింది.
రంగరాజన్ గారిపై జరిగిన దాడి దేవాలయ వ్యవస్థపై, అర్చక వ్యవస్థపై, సామాజిక సంస్కరణ వ్యవస్థపై, ఇంకా యావత్ హిందూ సమాజంపై జరిగిన దాడిగా VHP భావిస్తున్నదని, దాడికి పాల్పడ్డ సంఘ విద్రోహ శక్తులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుతున్నదని విశ్వహిందూ పరిషత్ - తెలంగాణ ప్రాంత అధ్యక్షులు భోజనపల్లి నర్సింహ మూర్తి, జాతీయ అధికార మీడియా ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ ఈ ప్రకటనలో తెలిపారు. సనాతన ధర్మపరంపరకు అవమానం కలిగించిన దోషులను హిందూ సమాజం ఏనాటికి క్షమించదని వారు స్పష్టం చేశారు.
రంగరాజన్ గారి మీద జరిగిన హత్యాయత్నంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి, పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, నిందితుల వెనుకనున్న సంఘవిద్రోహ శక్తులను చట్టప్రకారం ఉక్కుపాదంతో అణిచివేసే చర్యలు పోలీసులు వెంటనే తీసుకోవాలని ఈ ప్రకటన ద్వారా డిమాండ్ చేసిన విహెచ్పీ, రంగరాజన్ గారికి తగిన భద్రత కల్పించాలని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరింది.
హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం, హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి రంగరాజన్ గారు చేస్తున్న ఉద్యమంలో తాము ఎల్లప్పుడు ముందుంటామని VHP తెలిపింది. యజ్ఞం నిర్వహిస్తున్న మునుపై దాడులకు పాల్పడిన రాక్షసులను శ్రీరామచంద్రుడు కఠినంగా దండించి రామరాజ్యంలో శాంతిని కాపాడాడని, అదే విధంగా నేడు చిలుకూరి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై రాక్షస భావజాలంతో దాడి జరిపిన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణా ప్రభుత్వాన్ని VHP కోరింది.