తనతో సహా లక్షలాది మంది దేశం కోసం జీవించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుంచి ప్రేరణ పొందారని, పొందుతూనే వున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభించారు.
“మహారాష్ట్ర అనే గొప్ప దేశంలో, మరాఠీ మాట్లాడే ఒక గొప్ప వ్యక్తి 100 సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విత్తనాలను నాటారని మేము గర్విస్తున్నాము. నేడు, మనం దాని శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఆ సంస్థ మర్రి చెట్టులా పెరిగి అభివృద్ధి చెందింది” అని ప్రధాని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ తనలాంటి లక్షలాది మందిని దేశం కోసం జీవించడానికి ప్రేరేపించిందని, సంఘ్ కారణంగానే మరాఠీ భాష, మరాఠీ సంప్రదాయాలతో అనుసంధానమయ్యే అవకాశం తనకు లభించిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ గొప్ప సంప్రదాయాలు, సంస్కృతిని కొత్త తరానికి తీసుకెళ్లడానికి ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా సంస్కార యాగాన్ని నిర్వహిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.
అయితే, భారతీయ భాషల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రతి భాష ఒకదానినొకటి సుసంపన్నం చేసిందని, త ద్వారా భాష ప్రాతిపదికపై వివక్ష ప్రదర్శన యత్నాలకు అవి గట్టి గుణపాఠం నేర్పాయ ని చెప్పారు. మరాఠీని సంపూర్ణ భాషగా శ్లాఘించారు. ధైర్య సాహసాలు. రమ్యత, సున్నితత్వం, సమానత్వ లక్షణాలు కలగలిసిన భాష అది అని ఆయన పేర్కొన్నారు.
‘భారతీయ భాషల మధ్య ఎన్నడూ ఎటువంటి విరోధమూ లేదు. భాషలు ఎల్లప్పుడూ ప్రభావం చూపా యి, పరస్పరం సుసంపన్నం చేసుకున్నా యి’ అని మోదీ చెప్పారు. భాషల ఆధారం గా విభజనల సృష్టికి ప్రయత్నాలు జరిగినప్పుడు భారత్‌లో భాషాపరమైన వారసత్వ సంపద గట్టి సమాధానం ఇచ్చిందని ఆయన తెలిపారు.
‘ఈ దురవగాహనలకు దూరం గా ఉండి, అన్ని భాషలను స్వాగతించి, సుసంపన్నం చేసుకోవడం మన సామాజిక బాధ్యత’ అని ప్రధాని స్పష్టం చేశారు. కాగా, జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి) అమలు దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రాన్ని విధించే యత్నం అన్న తన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పునరుద్ఘాటించిన రోజు ప్రధాని మోదీ ఆ ప్రకటన చేయడం గమనార్హం.
భారత్ ప్రపంచంలో అత్యంత ప్రాచీన సజీవ నాగరికతల్లో ఒకటి అని, దేశం నిరంతరం పరివర్తన చెందుతూ, కొత్త అభిప్రాయాలను, మార్పులను స్వాగతించడం ఇందుకు కారణమని మోదీ పేర్కొన్నారు. ‘ప్రపంచంలో అతి పెద్ద భాషాపరమైన విభిన్నతను భారత్ కలిగి ఉండడం ఇందుకు నిదర్శననం. భాషాపరమైన ఈ విభిన్నత మన సమైక్యతకు అత్యంత మౌలిక ప్రాతిపదిక’ అని ప్రధాని తెలిపారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, 98వ అఖిల భారతీయ మరాఠీ సమ్మేళన్ అధినేత సాహితీవేత్త తారా భావల్కర్ ప్రభృతులు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. మూడు రోజుల అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్‌ను న్యూఢిల్లీలో 71 ఏళ్ల తరువాత, మరాఠీకి ప్రాచీన సాంస్కృతిక భాష హోదా మంజూరు చేసిన ఒక ఏడాది తరువాత నిర్వహిస్తున్నారు.