ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయని, రక్షణ కల్పించాలని విరాట్ హిందుస్థాన్ సంఘం డిమాండ్ చేసింది. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మౌన దీక్ష చేపట్టారు. నోటికి, కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
వీహెచ్ఎస్ రాష్ట్ర నాయకుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. ఆదోని డివిజన్లో 5,400 ఎకరాల ఆలయ భూములు ఉన్నాయని, అందులో నాలుగు వేల ఎకరాలు అన్యాక్రంతం అయిందన్నారు. సరైన నివేదికలు ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఉప తహసీల్దారు రాఘవేంద్రకు సమస్య విన్నవించారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం 4.45 వరకు బైఠాయించారు. అనంతరం సబ్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్, సీతారాముడు పాల్గొన్నారు.