![]() |
Marrying a Hindu is a sin: Muslim daughter, grandson detained |
మహారాష్ట్ర జాల్నా జిల్లా భోకార్డన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘాతుకం బైటపడింది. ఒక యువతిని, ఆమె మూడేళ్ళ కొడుకును గొలుసులతో కట్టేసి రెండునెలలుగా నిర్బంధించిన సంగతి తాజాగా బైటపడింది. భర్త ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు జోక్యం చేసుకుని బాధితులను ఫిబ్రవరి 3న విడిపించారు.
పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. జాల్నా జిల్లా ఆలాపూర్ గ్రామానికి చెందిన షహనాజ్ అలియాస్ సోనల్ 2020లో ఒక హిందూ దళిత యువకుణ్ణి పెళ్ళి చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు వారి పెళ్ళికి ఒప్పుకోలేదు. ఆ దంపతులు తమ వివాహాన్ని చట్టబద్ధంగా రిజిస్టర్ కూడా చేసుకున్నారు. వారికి ఒక బాబు ఉన్నాడు. షహనాజ్ తల్లి ఔరంగాబాద్‌లో నివసిస్తున్న కూతురిని చూసి వెడుతుండేది. గతేడాది అలా వెళ్ళినప్పుడు షహనాజ్ మతాంతర వివాహాన్ని ఆమె తండ్రి ఒప్పుకున్నాడనీ, ఒక్కసారి సొంతూరికి రమ్మనీ చెప్పి ఒప్పించింది. షహనాజ్ తన భర్త, కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. అయితే అక్కడ షహనాజ్ భర్తను తన్ని తరిమేసారు. ఆమెను, ఆమె కొడుకును బలవంతంగా నిర్బంధించారు. గొలుసులతో కట్టేసి ఒక గదిలో పెట్టి తాళం వేసేసారు.
షహనాజ్ భర్త ఎలాగైనా తన భార్యాపిల్లల వద్దకు వెళ్ళడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఆమె తల్లిదండ్రులు దగ్గరకు కూడా రానీయలేదు. గత్యంతరం లేక అతను మొదట స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. తర్వాత, ఆ వివాదంలో జోక్యం చేసుకోవాలంటూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఆదేశాల మేరకు పోలీసు బృందాలు ఈ యేడాది జనవరిలో రెండుసార్లు సోదాలు చేసారు. కానీ, షహనాజ్ ఆమె కొడుకులను ఎక్కడ నిర్బంధించారో తెలుసుకోలేకపోయారు.
క్రమంగా పోలీసులు షహనాజ్ సోదరుడి మీద ఒత్తిడి తెచ్చి, ఆమెను ఎక్కడ దాచిఉంచారో తెలుసుకున్నారు. ఆ సమాచారం ఆధారంగా పోలీసు అధికారులు జనవరి 29న మఫ్టీలో వెళ్ళారు. అక్కడ వారు షహనాజ్‌ను, ఆమె కొడుకునూ ఓ గదిలో గొలుసులతో కట్టి నిర్బంధించి ఉంచిన విషయాన్ని కనుగొన్నారు. వారిని విడిపించడానికి ప్రయత్నించేటప్పుడు షహనాజ్ తల్లిదండ్రులు పోలీసుల మీదనే దాడికి ప్రయత్నించారు.
షహనాజ్, ఆమె కొడుకులను విడిపించిన పోలీసులు వారిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ ప్రభుత్వ అటార్నీ వారిని ఆమె భర్తకు అప్పగించాడు. షహనాజ్ ఒప్పుకుంటే ఆమె తల్లిదండ్రుల మీద కేసు పెడతామని పోలీసులు చెబుతున్నారు.