ప్రయాగరాజ్ కుంభమేళాలో గ్రీసు దేశానికి చెందిన యువతి పెనెలోపెకు భారత్ కు చెందిన సిద్ధార్థకు జనవరి 26న పెళ్లి జరిగింది,
వధూవరులకు చెందిన బంధుమిత్రుల సమక్షంలో హిందూ వివాహ సంప్రదాయాన్ని అనుసరించి జరిగిన ఈ పెళ్లిలో జునా అఖాడా మహామండలేశ్వర్ స్వామి యతీంద్రానంద్ గిరి కన్యాదానం చేశారు. రుత్విక్కులు వేద మంత్రాలు పఠిస్తుండగా పెనొలోపె, సిద్ధార్థ అగ్నిగుండానికి ప్రదక్షిణ చేశారు. పూలదండలు మార్చుకున్నారు. పెనోలోపె కొన్నేళ్లుగా సనాతన ధర్మ సంప్రదాయాలను అనుసరిస్తూ వస్తున్నారు. జునా అఖాడాలో శిష్యురాలిగా ఉన్నారు.
సిద్దార్థ అనేక దేశాల్లో పర్యటించి యోగా, సనాతన ధర్మాన్ని ఆయా దేశాల ప్రజలకు పరిచయం చేశారు. ఆయన జునా అఖాడాలో ఓ భక్తుడు. ఇద్దరూ కూడా కొద్ది సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఎక్కడ చేసుకోవాలనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు కల్యాణానికి కుంభమేళాను మించిన పవిత్రమైన ప్రదేశం ఈ భూమిపై మరెక్కడా ఉండే ప్రసక్తి లేదని వారు భావించారు. చివరకు జునా అఖాడా సాధువుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుంభమేళా సంపూర్ణమయ్యేంతవరకు ప్రయాగరాజ్ లోనే ఉండిపోవాలని కొత్త దంపతులు నిర్ణయించుకున్నారు. ప్రయాగరాజ్‌లో పరిణయంతో అర్థవంతమైన తమ దాంపత్య జీవితానికి ఆధ్యాత్మికత తోడైందని వారు తెలిపారు.