Arif Mohammed Khan |
మహాకుంభమేళా భారతీయ సంస్కృతి మౌలిక ఆదర్శాలకు నిలువెత్తు రూపమని బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అన్నారు. దేశంలోని అన్ని వైవిధ్యాలూ ముగిసి అందరూ భక్తులుగా కనిపించే సందర్భం ఇది, ఈ మేళాలో కులాల వంటి భేదాలేమీ ఉండవని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘కుంభమేళా జరిగినన్ని రోజులూ ఎంతోమంది ప్రజలు ఒకేచోట కలుస్తారు. అందరి మనసుల్లోనూ ఒకటే భావన, ఒకటే తాదాత్మ్యత ఉంటుంది. కుంభమేళాకు వచ్చే సాధుసంతుల కులాల గురించి ఎవరూ అడగకూడదు. అందరూ భక్తులే. ఇదీ భారతదేశం విశిష్టత. ఇది భారతీయ సంస్కృతి అస్తిత్వం’’ అన్నారు.
గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఏకాత్మత భారతీయ సంస్కృతిలో అత్యున్నత ఆదర్శమనీ, అది ప్రపంచమంతటికీ మార్గదర్శనం చేస్తుందనీ చెప్పారు. ‘‘భారతదేశంలో మనం ప్రతీదానిలోనూ భగవంతుణ్ణి దర్శిస్తాం. అందుకే భారతదేశం ప్రపంచానికి మార్గం చూపించగలుగుతుంది’’ అన్నారు.
మరోవైపు, ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా వేడుకల్లోకి జగద్గురు ద్వారకా శారదా పీఠాధీశ స్వామి శ్రీ సదానంద సరస్వతీ మహారాజ్ గురువారం భారీ ఊరేగింపుతో ప్రవేశించారు. ఆ కార్యక్రమంలో మొత్తం 13 అఖాడాలతో పాటు అగ్ని అఖాడాకు చెందిన సాధుసంతులు పాల్గొన్నారు.
మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. నాలుగు రోజులు పవిత్ర స్నానాలు చేస్తారు. పుష్య పౌర్ణమి జనవరి 13న మొదటి షాహీస్నాన్, మౌని అమావాస్య జనవరి 29న రెండవ షాహీస్నాన్, వసంత పంచమి ఫిబ్రవరి 3న మూడవ షాహీస్నాన్, మాఘి పౌర్ణమి ఫిబ్రవరి 12న నాలుగవ షాహీస్నాన్ ఉంటాయి. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు కుంభమేళా ముగుస్తుంది.