The Kumbh Mela is the venue for the gathering of saints... |
కుంభమేళా వేదికగా సాధు సంతుల సమావేశం...
ప్రయాగ రాజ్ కుంభమేళా వేదికగా సాధు సంతుల సమావేశం జరిగింది. ఈ నెల 20,21 తేదీల్లో జరిగింది. పూర్వాశ్రమంలో ఎస్సీలుగా వుండి, ప్రస్తుతం ధర్మాచార్యులుగా వున్న వారి సమ్మేళనం ఇది. ఎస్సీలు అన్ని రంగాలతో పాటు ధర్మాచార్యులుగా సమాజంలో గౌరవ స్థానంలో వుండాలని, అలాగే ఎస్సీలలో తామూ హిందువులం అన్న మేల్కొలుపును కల్గించడానికి, ఆధ్యాత్మిక అవగాహనే లక్ష్యంగా ఈ సమ్మేళనం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సమ్మేళనానికి 14 రాష్ట్రాల నుంచి 80 మంది సన్యాసులు, ఇద్దరు సన్యాసినులు హాజరయ్యారు. మొత్తం 82 మంది సంతులు పాల్గొనగా, వారితో 39 మంది సహాయకులు కూడా వున్నారు.
వీరందరూ ప్రత్యేక బస్సుల్లో త్రివేణీ సంగమానికి చేరుకొని, పుణ్య స్నానాలు ఆచరించారు. మొదటి రోజు జరిగిన సమ్మేళనానికి వీహెచ్ పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ చేస్తున్న పనులు, కార్యక్రమాలను అలోక్ కుమార్ వివరించగా, సామాజిక సమరసత విషయంపై శ్యాం ప్రసాద్ వివరించారు. అయితే.. సామాజిక సమరసత విషయంలో సాధు సంతుల ద్వారా జరగాల్సిన పనులు, వారు ఏం చేయాలి? వారి సహాయ సహకారాలు ఎలా వుండాలి? అన్న దానిని శ్యాం ప్రసాద్ వివరించారు. మరోవైపు ఆరెస్సెస్ సహ వ్యవస్థా ప్రముఖ్ అనిల్ ఓక్ కూడా ఇదే విషయంపై మాట్లాడారు. అలాగే మహాకుంభ మేళా చరిత్రను కూడా వివరించారు. చివరగా 20 వ తేదీన రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలతో ముగిసింది.
ఇక... 21 వ తేదీన సమరసత నిర్మాణంలో జరుగుతున్న ప్రయత్నాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. చాలా మంది సాధువులు దీనిపై లోతుగా చర్చించారు. ఇక సమారోప్ కార్యక్రమానికి ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ కృష్ణ గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహా కుంభమేళా చరిత్రపై ప్రసంగించారు. తదనంతరం ఆరెస్సెస్ అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రాంలాల్ కూడా ప్రసంగించారు. చివరగా యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ స్వామీజీలను సన్మానించి, మాట్లాడారు.