పశువుల పండుగ కనుమ |
( నేడు జనవరి 15 – కనుమ )
సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువులను పూజించే పర్వదినం. రైతులు ఉదయాన్నే లేచి పశువుల పాకను, పశువులను శుభ్రంచేస్తారు. కుంకుమ బొట్లు అద్దుతారు. పూలహారాలు వేసి పూజిస్తారు.
వండిన పొంగలిని భగవంతునికి నివేదించి, కొంత పశువులకు తినిపించి, మిగిలినదాన్ని పొలాల్లో జల్లుతారు. ఈ ప్రసాదంతో పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పశువుల శ్రమతోనే పంట తమ చేతికి అందుతోందన్న కృతజ్ఞతా సూచకంగా వాటిని పూజించి, గౌరవించడం ఆనవాయితీ. అలంకరించిన గంగిరెద్దులను వీధుల్లో ఊరేగిస్తారు. పశువులతో పాటు నాగలికీ పూజ చేస్తారు. ‘కనుమ నాడు కాకి కూడా కదలదు’ అన్న నానుడి తెలిసిందే కదా! అందుకే ఆరోజు ఏ పనికీ వెళ్లరు, ప్రయాణం కూడా చేయరు. ‘కనుమ నాడు మినుము కొరకవలె’ అన్న లోకోక్తి ప్రకారం గారెలు తింటారు.
‘ముక్కనుమ’ కనుమ తోటిదే. ఆరోజు కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు సావిత్రీ గౌరీ వ్రతం చేసి, అమ్మవారి బొమ్మలతో బొమ్మలనోము నోచుకుంటారు. గౌరీదేవిని తొమ్మిది రోజులు పూజించి, తొమ్మిది పిండి వంటలను నివేదిస్తారు. తర్వాత ఆ మట్టిబొమ్మలను పుణ్యతీర్థంలో నిమజ్జనం చేస్తారు.
మూడు రోజులు ఆనందోత్సాహాలతో చేసుకునే సంక్రాంతి బంధాలను బలపరుస్తుంది. ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. సస్యలక్ష్మిని ఆహ్వానిస్తుంది. ఇది మన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దం. ఆత్మీయతలూ అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం