అయోధ్య రామ మందిరం పాత రికార్డులు ఫళ్లున తెగాయి. అత్యధిక సంఖ్యలో భక్తులు రాముడ్ని దర్శించుకుంటున్నారు. గత 30 గంటల్లో 25 లక్షలకు పైగా భక్తులు రాముడి దర్శనం చేసుకున్నారు.
ఇంకా రద్దీ కొనసాగుతూనే వుంది. ఇంత రద్దీ వస్తున్నా... భక్తులెవ్వరికీ దర్శనం విషయంలో కానీ, సౌకర్యాల విషయంలో గానీ అసౌకర్యం కలగడం లేదన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. వచ్చే అమావాస్య, బసంత్ పంచమి పండుగ వరకు అయోధ్య భక్తులతో కిటకిటలాడుతుందని భావిస్తున్నారు.
ప్రయాగరాజ్ వేదికగా మహాకుంభమేళా రంగరంగ వైభోగంగా జరుగుతోంది. అక్కడ పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అయోధ్య దర్శనం కూడా చేసుకుంటున్నారు. దీంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఈ అంచనాకి యూపీ ప్రభుత్వం ఎప్పుడో వచ్చేసింది. అందుకే మహాకుంభ మేళా తర్వాత అయోధ్య దర్శనానికి వస్తారని గ్రహించే... భక్తులకు ఇబ్బందులు లేకుండా యోజన చేసింది. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ప్రణాళికలు వేశారు.
స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంపై కూడా శ్రద్ధ వహించడంతో అధికార గణం కూడా అలర్ట్ అయ్యింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్, ఐజీ ప్రవీణ్ కుమార్, జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర విజయ్ సింగ్ జాతర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
రామ మందిరానికి రద్దీ ఎక్కువవుందని ముందే గ్రహించి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా రోడ్లను కూడా వెడల్పు చేసింది. ఢిల్లీలో కర్తవ్య పథ్ లాగే... అయధ్యలో కూడా రాంపథ్ ను నిర్మించారు. అయితే... ఊహించిన దానికంటే భక్తులు రావడంతో రాంపథ్ కూడా నిండిపోయింది.అంతే కాకుండా జన్మభూమి మార్గం, రామాలయానికి వెళ్లే రహదారి, హనుమాన్‌గర్హికి వెళ్లే భక్తిపథ్, ధర్మపథ్లలో భక్తుల రద్దీ పెరుగుతోంది.
రామాలయంలో భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, ట్రస్ట్ అంగద్ తిల నుండి భక్తులు బయటకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసింది, అయితే రద్దీ ఊహించని విధంగా ఉండటంతో, గేట్ నంబర్ 3 నుండి కూడా బయటికి వెళ్లడానికి సౌకర్యాలు చేశారు.హనుమాన్‌గర్హి వద్ద కిలోమీటరున్నర పొడవునా లైన్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త లేన్‌ను సిద్ధం చేశారు.
మరోవైపు మౌని అమావాస్యను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పెద్ద పెద్ద వాహనాలను దారి మళ్లించారు. అయోధ్య సిటీలోకి పెద్ద పెద్ద వాహనాల రాకపోకలను నిషేధించారు. భక్తులకు స్వాగతం పలికేందుకు కూడళ్లల్లో ఏర్పాట్లు కూడా చేశారు.