ముస్లిం పాలకులైన మొఘలుల అరాచక పరిపాలనను ఎదిరించి ప్రాణత్యాగానికి వెనుకాడని ఐదు సంవత్సరాల ఫతేసింగ్, ఏడు సంవత్సరాల జొరావర్ సింగ్ వీరగాథను నేటి తరాలు స్మరించుకునేందుకే వీర్ బాల్ దివస్‌ని ప్రతి ఏటా జరుపుకుంటున్నాము.
వీరిద్దరూ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు. చిన్నపిల్లలు అయినా సరే తండ్రి, అన్నల బాటలో దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన వీర పుత్రులు. ఒకసారి గురు గోవింద సింగ్ ఆనందపూర్ కోటలో ఉండగా ఆ కోటపై మొగలాయిలు దాడి చేశారు. గురు గోవింద్ సింగ్ పుత్రులైన అజిత్ సింగ్, జడు ఝూర్ సింగ్ (ఫతే సింగ్, జొరావర్ సింగ్‌ల కంటే పెద్దవారు) ఆ యుద్ధంలో మొఘలులతో పోరాడి వీర మరణం పొందారు. దాంతో గురుగోవింద్ సింగ్ కుటుంబం ఆనందపూర్ను వదలాల్సి వచ్చింది.
ఆనందపూర్ను వదిలి పెట్టే సమయంలో గురుగోవింద్ సింగ్ కుటుంబం విడిపోయింది. ఆయన చిన్న కుమారులు జొరావార్ సింగ్, ఫతే సింగ్ వారి నాన్నమ్మ గుజరీమాతతో కలిసి ఒక కార్మికుడి ఇంట్లో కొంతకాలం పాటు నివసించారు. తరువాత వారి పాత సేవకుడైన గంగూ పండితుడి ఇంటికి మకాం మార్చారు. సహజంగానే గుజరీమాత సిక్కు గురువుల త్యాగం, వీరత్వం, బలిదానం గూర్చిన గాథలు పిల్లలకు చెబుతూ ఉండేది. పిల్లలు కూడా తమ నానమ్మ చెప్పే తమ పూర్వీకుల వీరగాథలు శ్రద్ధగా వినేవారు. గంగూ పండితుడు ధనాశతో వారిని మొఘలులకు పట్టించాడు. గుజరీమాతను, పిల్లలను మొఘలు సైనికులు ఒక ఎద్దుల బండిలో ఎక్కించి సర్ హింద్‌కు బయలుదేరారు. సర్ హింద్ కు చేరిన పిదప గుజరీమాతకు, పిల్లలకు ఆహారం కూడా పెట్టకుండా డిసెంబరు నెల చలిలో ఒక బురుజులో ఉంచారు. పిల్లలు తమ నాయనమ్మతో కలిసి భగవత్ భజన చెయ్యడం మొదలుపెట్టారు. గుజరీమాత రాత్రంతా పిల్లలకు వీరగాథలు చెబుతూ గడిపింది. ఈ క్లిష్టమైన పరిస్థితులలో వారు తమ ధర్మం పట్ల నిష్ఠను కోల్పోకుండా ఉండేలా వారికి తగిన బోధలు చేసింది. తమ పూర్వీకుల పేరు, తండ్రి పేరు నిలబెడతామని, ఏ విధమైన ప్రలోభాలకు గాని, ప్రాణ భయానికి గాని తలొగ్గమనీ ఆ బాలురు వాళ్ళ నాన్నమ్మకు వాగ్దానం చేశారు.
పొద్దున నవాబు ఆ పిల్లలను ఇస్లాం మతం స్వీకరించమని ఒత్తిడి చేశాడు. కానీ పిల్లలు నిర్భయంగా పెద్ద గొంతుతో “ మేం గురు గోవింద సింగ్ పుత్రులం. మా తాత గురు తేజ్ బహదూర్ హిందూ ధర్మాన్ని రక్షించడానికి బలి దానం చేశాడు. మేము వారి సంతానం. మేము మా ధర్మాన్ని ఎప్పటికీ వదులుకోము. మాకు ధర్మం ప్రాణాల కంటే ప్రియమైనది.” అని పలికారు. "పిల్లలూ మిమ్మల్ని వదిలి పెడితే మీరు ఏం చేస్తారు?" అని ప్రశ్నించిన మంత్రి సచ్చానందునికి “మేం సైనికులను సమకూర్చుకుంటాం. మీరు చేస్తున్న అత్యాచారాలను ఆపడానికి మేము చనిపోయేవరకు యుద్ధం చేస్తాం” అని జవాబిచ్చాడు బాలుడైన జొరావర్ సింగ్. అప్పుడు పిల్లల మనో ధైర్యం పోగొట్టడానికి “మీ తండ్రి, మీ అన్నలు యుద్ధంలో చనిపోయారు. ఇక మీకు ఈ లోకంలో ఎవరూ లేరు. కాబట్టి నవాబు చెప్పినట్లు వినండి. ఇస్లాం స్వీకరించండి.” అని చెప్పాడు మంత్రి.
పిల్లలు మరింత గట్టిగా “మా తండ్రి ఒక మహావీరుడు. ఆయనను ఎవరూ చంపలేరు” అన్నారు. ఈ జవాబు విన్న నవాబు వారిని సజీవ సమాధి చేయాల్సిందిగా ఆజ్ఞాపించాడు. సజీవ సమాధి చేయడం కోసం పిల్లలిద్దరినీ నిర్ణీత స్థలానికి తీసుకొచ్చారు. ఆశ్చర్యం! ఇద్దరు పిల్లలూ నవ్వుతూ నిశ్చింతగా నిలబడి ఉన్నారు. ప్రపంచ చరిత్రలో చిన్నపిల్లలను ఇంత నిర్దయగా అంతమొందించిన సంఘటన మరొకటి లేదు. అదే విధంగా ఈ వీర బాలురు చూపిన అపూర్వ సాహసం ప్రపంచంలో మరే దేశ చరిత్రలోనూ కనపడదు.
మాఛివాడేలోని ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా, తన చిన్న కుమారులిద్దరూ సజీవ సమాధి చేయబడ్డారన్న వార్త గురు గోవింద్ సింగ్‌కు తెలిసింది. గురు గోవిందుడు చలించలేదు. బాణంతో ఒక మొక్కను పెకలించి "ఇక మొగల్ సామ్రాజ్యం కూడా ఇలాగే పెకిలించి వేయబడుతుంది” అని పలికాడు. గురు గోవింద్ సింగ్, ఆయన కుమారుల సాహసం, పరాక్రమము, త్యాగం చరిత్ర పుటలలో అజరామరంగా నిలచిపోయింది.
Fateh Singh Zorawar Singh |
ప్రపంచంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడుందో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ల్యాండ్ డీల్ ఎక్కడ జరిగిందో తెలుసా? లండన్లోనా? పారిస్లోనా? న్యూయార్క్లోనా? కాదు, ఇప్పటి వరకూ ప్రపంచ చరిత్రలో అత్యంత ఖరీదైన ల్యాండ్ డీల్ జరిగింది, భూమికి అత్యధిక ధర చెల్లించింది మన భారతదేశంలోనే. అది కూడా పంజాబ్‌లోని సర్ హింద్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ భూమిని కొనుగోలు చేసిన ఆ గొప్ప వ్యక్తి పేరు దివాన్ తోడర్ మల్.
గురుగోవింద్ సింగ్ కుమారులు బాబా ఫతే సింగ్, బాబా జోరావర్ సింగ్‌ల బలిదానం గురించి మీరందరూ ఎక్కడో ఒకచోట, ఏదో ఒక సమయంలో వినే ఉంటారు. ఇక్కడే సర్ హింద్‌లోని ఫతేఘర్ సాహిబ్‌లో అప్పటి మొఘల్ సైనికుడు వజీర్ ఖాన్, పదేళ్ళ జోరావర్ సింగ్, ఏడేళ్ళ ఫతే సింగ్ లిద్దరినీ చంపాడు. ఆ పసి వాళ్ళిద్దరూ జీవించి ఉండగానే నిలబెట్టి, వారి చుట్టూ ఒక్కొక్క ఇటుకే పేరుస్తూ వారికి సజీవ సమాధి చేశాడు వజీర్ ఖాన్.
ఆ ప్రాంతంలో అత్యంత సంపన్నుడైన దివాన్ తోడర్ మల్, గురుగోవింద్ సింగ్ కుటుంబంపైన అత్యంత భక్తి శ్రద్ధలు కలిగినవాడు. గురుగోవింద్ సింగ్ జీ కుటుంబం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. గురుగోవింద్ సింగ్ కుమారులు, పసివాళ్ళు ఫతే సింగ్, జోరావర్ సింగ్, గురు గోవింద్ సింగ్ తల్లి గజారీ మాతల మృత దేహాలను, వారు బలిదానం చేసి, అమరులైన భూమిని వజీర్ ఖాన్ నుండి కోరాడు. ఆ బాల ధర్మ వీరులకు అంత్యక్రియలు నిర్వహించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. అందుకు ఆ నీచుడు వజీర్ ఖాన్ ఏం కోరాడో తెలుసా? ఆ స్థలం పైన బంగారు నాణాలు పేర్చుకుంటూ వస్తే.... మొత్తం ఎన్ని బంగారు నాణాలు అవుతాయో, అదే ఆ స్థలం విలువ అవుతుందని, అలా బంగారు నాణాలను పేర్చి, ఆ మొత్తాన్ని తనకు చెల్లిస్తే ఆ భూమిని తోడర్ మల్కు అప్పగిస్తానని వజీర్ ఖాన్ నిస్సిగ్గుగా చెప్పాడు.
తోడర్ మల్ అందుకు అంగీకరించి, తన యావదాస్తిని అమ్మి, ఆ మొత్తం సొమ్మును బంగారు నాణాలుగా మార్చి, ఆ నేలపై ఒక్కొక్క నాణాన్ని పేర్చడానికి ఉద్యుక్తుడవుతున్న తరుణంలో, వజీర్ ఖాన్ మరింతగా తన అత్యాశను, దుష్ట బుద్ధిని ప్రకటించాడు. ఆ నాణాలను ఒకదాని పక్కన ఒకటి నిలువుగా పేర్చాల్సిందిగా తోడర్ మల్ ను ఆదేశించాడు. అలాగైతే మరిన్ని ఎక్కువ నాణాలు వస్తాయనేది వాడి దుర్మార్గపు ఆలోచన. వజీర్ ఖాన్ చెప్పినట్లుగా నాణాలను పేర్చుకుంటూ వస్తే.... ఆ నాలుగు చదరపు అడుగుల స్థలంలో మొత్తం 78,000 బంగారు నాణాలు పట్టాయి. ఆ రోజుల్లోనే వాటి విలువ 250 కోట్లు. ఇదే ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకూ అత్యంత ఖరీదైన, అత్యంత తక్కువ విస్తీర్ణం కలిగిన భూమి. కానీ తన గురు పుత్రుల అంత్యక్రియలను ఆ స్థలంలో నిర్వహించడానికి తోడర్ మల్ తన యావదాస్తిని అమ్మి ఆ భూమిని కొన్నాడు. ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకూ ఇలాంటి త్యాగం చేసిన వారెవరూ లేరు. అంత పెద్ద మొత్తానికి, అంత చిన్న స్థలాన్ని కొనుగోలు చేసిన వారూ లేరు. అక్కడ ఫతే సింగ్, జొరావార్ సింగ్‌ల స్మృత్యర్థం నిర్మించిన భవనాన్ని జహాజ్ హవేలీ లేదా జహాజ్ మహల్ అంటారు. ఈ హవేలీ ఇప్పుడు, ఫతేఘర్ సాహిబ్ నుండి కేవలం ఒక కి.మీ దూరంలో ఉన్న సర్ హింద్-రూప్‌నగర్ రైల్వే లైన్ తూర్పు వైపున ఉండే హర్నామ్ నగర్లో ఉంది. ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం మరియు INTACH సహకారంతో, ఈ ప్రదేశాన్ని SGPC స్వాధీనం చేసుకుని పునరుద్ధరిస్తోంది.
భారత్ మాతాకీ జై