రైళ్ళను ఉద్దేశపూర్వకంగా పట్టాలు తప్పించిన సంఘటనలు ఇటీవల మన దేశంలో చాలా వెలుగు చూసాయి. అయితే, రైళ్ళను పట్టాలు తప్పించడం ఎలా అన్న విషయాన్ని ప్రత్యేకంగా కొన్ని మదరసాల్లో నేర్పిస్తున్నారు. ఆ కుట్రకు సంబంధించిన విషయాలు ఎన్ఐఏ-ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తులో వెల్లడయ్యాయి. యూపీలోని ఝాన్సీ, కాన్పూర్ నగరాల్లో కొన్ని మదరసాల్లో ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది.
దర్యాప్తు వివరాల ప్రకారం… మదరసాల్లో విద్యార్ధులను రాడికలైజ్ చేస్తున్నారు, రైళ్ళు పట్టాలు తప్పేలా చేయాలని వారిని పురిగొలుపుతున్నారు. అంతేకాదు, రైళ్ళు పట్టాలు తప్పేలా ఎలా చేయాలన్న విషయం మీద కూడా వారికి శిక్షణ లభిస్తోంది. దర్యాప్తులో భాగంగా భద్రతా దళాలు ఝాన్సీ, కాన్పూర్ నగరాల్లోని పలు మదరసాల్లో సోదాలు చేపడుతున్నారు.
రైళ్ళు పట్టాలు తప్పించడం ఎలా అనే అంశంపై మదరసాల్లో శిక్షణ ఆన్లైన్లో ఇస్తున్నారు. ఆ మేరకు పలు వీడియోలను దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. వాటిలో ఇస్లామిక్ అతివాదులు రైళ్ళను పట్టాలు తప్పించాలంటూ యువతను రెచ్చగొడుతున్నారు. ఆ పని ఎలా చెయ్యాలన్న విషయాన్ని కూడా వివరిస్తున్నారు. అటువంటి కుట్రకు సంబంధించి ఒక మదరసా టీచర్ ముఫ్తీ ఖాలిద్ నద్వీని పోలీసులు అరెస్ట్ చేసారు.
దర్యాప్తు బృందాలు గురువారం నద్వీ ఇళ్ళలో సోదాలు చేసారు. పలు గంటల పాటు ప్రశ్నించారు. తదుపరి దర్యాప్తు కోసం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళాలని ప్రయత్నించారు. అయితే ముస్లిం మూక పోలీస్ కాన్వాయ్‌ని చుట్టుముట్టి నద్వీని విడిపించుకుపోయింది.
ఆ తర్వాత పోలీసులు అతన్ని మళ్ళీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ తదితర వస్తువులు సీజ్ చేసారు. నద్వీ ఉగ్రవాద కార్యకలాపాలు, విదేశీ నిధులకు సంబంధించిన కేసులో నిందితుడు. అతన్ని ప్రశ్నించిన పిమ్మట పోలీసులు విడిచిపెట్టారు.
నద్వీని తీసుకువెళ్ళే సమయంలో ఎన్ఐఏ-ఏటీఎస్ బృందాలను అడ్డుకుని నిందితుణ్ణి విడిపించుకుని పరారైపోవడం మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ సంఘటనకు సంబంధించి సుమారు 100 మంది మీద కేసు నమోదయింది.
గత మూడు నెలల్లో ఝాన్సీ, కాన్పూర్ పరిసర ప్రాంతాల్లో సబర్మతి ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్ళను పట్టాలు తప్పించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే వందేభారత్ రైలు మీద రాళ్ళు రువ్వారు. రైలుపట్టాల మీద సిలెండర్లు, దుంగమొద్దులు, టైర్లు వంటివి పెట్టారు. రైల్వే పనివాళ్ళు లేదా స్థానికులు వాటిని గమనించి సమాచారం ఇస్తుండడంతో పెద్దగా అవాంఛనీయ సంఘటనలేమీ జరగలేదు.
Courtesy : vskts