కర్నూలు జిల్లా డోన్ రూరల్ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గుర్తు తెలియని ఆగంతకులు గుప్త నిధులు కోసం తవ్వకాలు చేపట్టారు. గ్రామంలోని పురాతన బావిలో ఉన్న శివలింగాన్ని ధ్వంసం చేశారు. శివలింగం ధ్వంసమై ఉండటంతో గ్రామస్తులు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గతంలో రెండుసార్లు తవ్వకాలు
గతంలో 2013లోనూ, నాలుగేళ్ల క్రితం మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు గ్రామంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారని, నంది విగ్రహన్ని ధ్వంసం చేశారని గ్రామస్తులు చెప్పారు. దుండగులు పదే, పదే తవ్వకాలు జరుపుతుండటంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. సంఘటన జరిగినప్పుడు పోలీసులు గ్రామంలోకి వస్తున్నారు. పరిశీలిస్తున్నారు.వెళ్లిపోతున్నారు. దుండగులను ఒక్కరిని కూడా పట్టుకోకపోవడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడైనా పోలీసులు దృష్టి పెట్టి దుండగులను పట్టుకోవాలని, గ్రామస్తులు కోరుతున్నారు.