సంభాల్ అల్లర్ల విషయంలో కాంగ్రెస్ అనుకూల స్వామీజీగా పేరు పొందిన ఆచార్య ప్రమోద్ కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సంభాల్ అల్లర్ల సూత్రధారి సమాజ్ వాదీ పార్టీ అని పేర్కొన్నారు.
ఆ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నేతల హస్తం ఈ అల్లర్ల వెనుక వుందని అన్నారు. అల్లర్ల వైపు ప్రజలను ప్రేరేపించిందే ఆ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఈ అల్లర్ల వెనుక సమాజ్ వాదీ నేతల హస్తం వుందని, ప్రజలను రెచ్చగొట్టి, రాళ్లు రువ్వేలా చేసిందే ఆ పార్టీ అని అన్నారు. ఈ అల్లర్లలో సుమారు 10 వేల మంది వరకు పాల్గొన్నారన్నారు. ఇంత మందిని అక్కడికి చేర్చింది ఎవరన్నదే అసలు ప్రశ్న అంటూ పరోక్షంగా సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నట్లుగా వ్యాఖ్యానించారు. అఖిలేష్ ప్రమేయం వుందని, లేదంటే వారికి నోటీసులు పంపి వుండేవారన్నారు.
మరోవైపు సర్వే విషయంపై కూడా ప్రమోద్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయమే కాదన్నారు. ఇది ఓ వ్యక్తికి సంబంధించినదని, అతను కోర్టుకెళ్లి, సందేహాన్ని వ్యక్తం చేస్తూ... సర్వేను కోరుతున్నారంటూ పేర్కొన్నారు. ఏది ఏమైనా సర్వే పనులు సజావుగా జరిగేట్లు చూడటం పోలీసు శాఖ విధి అని అన్నారు.
సంభాల్ అల్లర్ల వెనుక రాజకీయ నాయకుల హస్తం వుందని, ప్రతి రోజూ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగేవారే సంభాల్ ని తగలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్కడ కల్కిధామ్ నిర్మిస్తామని అన్నప్పుడు... అలా చేస్తే అల్లర్లు రేపుతామని అప్పట్లో సంభాల్ ఎంపీగా వున్న సఫీకర్ రెహ్మాన్ బుర్కే బెదిరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.