త్వరలోనే అయోధ్య రామ మందిరం తొలి వార్షిక వేడుకలు నిర్వహించేందుకు అయోధ్య ఆలయ అధికారులు చూస్తుండగా, తాజాగా అయోధ్య రామ మందిరం భారతదేశంలోనే అత్యంత ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన పర్యాటక కేంద్రంగా నిలిచింది.
ఇప్పటివరకు భారత్‌లోనే టాప్ టూరిస్ట్ స్పాట్‌గా తాజ్ మహల్ ఉండగా తాజాగా అయోధ్య దాన్ని దాటేసి నంబర్ వన్‌గా నిలిచింది. అయోధ్య రామమందిరం సరికొత్త రికార్డ్ సొంతం చేసుకున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీజేపీ సర్కార్ వెల్లడించింది. దేశంలోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్ మహల్ అగ్రగామిగా ఉండగా తాజాగా ఆ రికార్డ్‌ను అయోధ్య బద్దలుకొట్టిందని యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది ప్రారంభోత్సవం జరుపుకున్న అయోధ్యను ఇప్పటివరకు రికార్డు స్థాయిలో పర్యాటకులు సందర్శించారని, ఇది తాజ్ మహల్‌ను సందర్శించిన వారి కంటే అధికమని మంత్రి జైవీర్ సింగ్ తేల్చి చెప్పారు. ఇక శతాబ్దాల తర్వాత నిర్మితమైన అయోధ్య రామమందిరాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా భారీగా పర్యాటకులు వచ్చి సందర్శించారు.2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యను 13.55 కోట్ల మంది భారతీయులు సందర్శించినట్లు తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. వీరితోపాటు 3153 మంది విదేశీ పర్యాటకులు కూడా అయోధ్యను సందర్శించారని ఉత్తర్‌ప్రదేశ్ పర్యాటక శాఖ తాజాగా వెల్లడించింది.
అదే సమయంలో ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌ను మొత్తం దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు కలిపి 12.51 కోట్ల మంది సందర్శించినట్లు తెలిపింది. కేవలం 9 నెలల్లోనే తాజ్ మహల్ రికార్డ్‌ను అయోధ్య రామ మందిరం అధిగమించినట్లు యూపీ సర్కార్ స్పష్టం చేసింది. అయోధ్య, తాజ్ మహల్‌తోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆయా పర్యాటక కేంద్రాలను జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో 47.61 కోట్ల మంది పర్యాటకులు సందర్శించినట్లు యూపీ టూరిజం శాఖ తెలిపింది.
గత ఏడాది 48 కోట్ల మంది పర్యాటకులు యూపీకి రాగా, అయితే ఈ ఏడాది కేవలం 9 నెలల్లోనే ఆ మైలురాయిని చేరుకున్నట్లు యూపీ టూరిజం మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయోధ్య, తాజ్‌మహల్ కాకుండా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి క్షేత్రాన్ని 6.2 కోట్ల మంది భారతీయులతోపాటు 1.84 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించినట్లు వెల్లడించారు.
ప్రయాగ్‌రాజ్‌ను మొత్తం 4.80 కోట్ల మంది పర్యాటకులు సందర్శించగా, అందులో 4,790 మంది విదేశీయులు కూడా ఉన్నట్లు తెలిపారు. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో 6.8 కోట్ల మంది పర్యటించినట్లు చెప్పారు. వీరిలో 87,229 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని పేర్కొన్నారు. 1.18 కోట్ల మంది మీర్జాపూర్‌ను సందర్శించినట్లు వెల్లడించారు.
అయితే గత కొంత కాలంగా తాజ్ మహల్‌ను వీక్షించేందుకు అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతుండగా, దేశీయ టూరిస్టుల సంఖ్య మాత్రం స్వల్పంగా తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2022-23లో అంతర్జాతీయంగా తాజ్ మహల్‌కు వచ్చేవారి సంఖ్య 26.84 లక్షల నుంచి 2023-24 నాటికి 27.70 లక్షలకు పెరగ్గా, దేశీయ పర్యాటకుల సంఖ్య మాత్రం 1.93 లక్షలు తగ్గినట్లు ఉత్తర్‌ప్రదేశ్ పర్యాటక శాఖ స్పష్టం చేసింది.