బంగ్లాదేశీయులకు వైద్యం బంద్ : త్రిపుర, కోల్ కత్తా వైద్యుల ప్రకటన
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు, వారిని చిత్రహింసలు పెట్టడం, దేవాలయాలపై దాడులు... భారత జాతీయ పతాకాన్ని అవమానం జరగడంతో కోల్ కత్తా, త్రిపుర వైద్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ పౌరులకు, పేషెంట్లకు తాము చికిత్స చేయమని కోల్ కత్తా, త్రిపుర వైద్యులు ప్రకటించారు. కోల్కతాలోని జేఎన్ రాయ్ ఆసుపత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశీ పేషెంట్లకు నిరవధికంగా వైద్య చికిత్సలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. బంగ్లాదేశీయులు భారత పతాకాన్ని అవమానించడంపై నిరసన తెలిపింది. భారత్ కి జరుగుతున్న అవమానానికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆసుపత్రి అధికారి సుభ్రాన్షు తెలిపారు.
నిరవధికంగా తాము ఏ బంగ్లాదేశ్ రోగికి కూడా చికిత్స చేయమని, చికిత్స కోసం చేర్చుకోమని తేల్చి చెప్పారు. భారత్ పట్ల, హిందువుల పట్ల అత్యంత దారుణంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సిటీలోని మిగతా ఆస్పత్రులు కూడా తమ దారిలోనే నడవాలని పిలుపునిచ్చారు.భారత దేశ త్రివర్ణ పతాకాన్ని కూడా బంగ్లాదేశీయులు తీవ్రంగా అవమానించారని వైద్యులు ఆక్షేపించారు. భారత దేశం వారి స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిందని, అయినా... వారు భారత్ పై కక్షగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్రిపురలోని ILS ఆస్పత్రి కూడా బంగ్లాదేశ్ పేషెంట్లకు వైద్యం చేయమని ప్రకటించింది. అయితే.. బంగ్లాదేశ్ పౌరులకు వైద్య సేవలు నిరవధికంగా నిలుపుదల చేయాలని కొందరు ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు. దీంతో ఈ డిమాండ్ తో తామూ ఏకీభవిస్తున్నామని, ఇకపై బంగ్లాదేశ్ పౌరులకు వైద్య సేవలు అందించమని ఆస్పత్రి వైద్యులు తేల్చి చెప్పారు. ఇది ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుందని కీలక ప్రకటన చేశారు.