బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న మారణకాండ, మైనార్టీల మానవహక్కుల ఉల్లంఘనకు శాశ్వతంగా ముగింపు పలికేలా భారత ప్రభుత్వం వెంటనే అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని అంతర్జాతీయ మానవహక్కుల దినం సందర్భంగా హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశం పిలుపిచ్చింది.
బంగ్లాదేశ్ హిందువుల కొనసాగుతున్న నరమేధంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న హింసకు శాశ్వతంగా ముగింపు పలికేలా దీర్ఘకాల, స్వల్పకాల పరిష్కారాలపై దృష్టి సారించాలని స్పష్టం చేసింది.
బంగ్లాదేశీయులు ఆ దేశంలోని హిందువులపై కొనసాగిస్తున్న మారణకాండ, మైనార్టీల మానవ హక్కుల ఉల్లంఘనకు శాశ్వతంగా వెంటనే ముగింపు పలికేలా ఒత్తిడి తెచ్చే విధంగా భారత ప్రభుత్వం ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలితో సహా అన్ని అంతర్జాతీయ వేదికలపైనా లేవనెత్తాలని డిమాండ్ చేసింది.
భారత్‌లోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధ్యతగల పౌర సమాజం యావత్తూ బంగ్లాదేశ్ హిందువులపై కొనసాగుతున్న మారణకాండ, మైనార్టీల మానవహక్కుల ఉల్లంఘనకు శాశ్వతంగా వెంటనే ముగింపు పలికేలా బంగ్లాదేశీయులపై ఒత్తిడి తీసుకురావాలని కోరింది. బంగ్లాదేశ్‌లోని హింసాకాండను ముగించేందుకు గాను ఆ దేశంలోని పౌర సమాజ వర్గాలతో సంప్రదింపులు జరపాలని సూచించింది.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మహ్మద్ యూనస్‌కి గతంలో ప్రదానం చేసిన నొబెల్ బహుమతిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ సమావేశం డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్‌లో ఇప్పటికే అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చేసి వారి రక్షణకు హామీ ఇవ్వాలని ఆ దేశంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
భారత హోంశాఖ పూర్వ కార్యదర్శి పద్మనాభయ్య ముఖ్యఅతిధిగా పాల్గొంటూ ఆఫ్ఘనిస్తాన్, బర్మా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు ఒకనాడు భారత్‌లో భాగంగా ఉండేవని గుర్తు చేశారు. పూర్వ ప్రధాని గుజ్రాల్ నేతృత్వంలోని ప్రభుత్వం “పొరుగు దేశాలకు ప్రాధాన్యత” అంటూ అనుసరించిన విధానం ఏ మేరకు విజయవంతమైందో నేటి పరిణామాలను చూసి మనమే గ్రహించాలని సూచించారు.
సెక్యులర్ రాజ్యాంగం ఉన్నప్పటికీ ముస్లింలు అధికంగా ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువులకు తీవ్ర నష్టం జరిగిందని, మన దేశంలో కూడా ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్న విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు.
అంధ్రభూమి పత్రిక పూర్వ సంపాదకులుఎంవిఆర్ శాస్త్రి మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో హింసాకాండకు ప్రధాన బాధ్యత ఆ దేశ ప్రధాని మహ్మద్ యూనిస్దేనని స్పష్టం చేసారు. లక్షలాది మంది హిందువులపై మారణకాండ జరుగుతుంటే మౌనంగా ఉన్న కమ్యూనిస్టుల వైఖరిని ఎండగట్టారు. బంగ్లాదేశ్ హిందువులను కాపాడే క్రమంలో పాకిస్తాన్‌కు సైతం బుద్ధి చెప్పాలంటే 1971 నాటి పరిణామాల తరహాలోనే అక్కడ భారత్ జోక్యం చేసుకోవాలని, వారికి అర్థమయ్యే భాష అదేనని, అప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆయన తేల్చి చెప్పారు.
సామాజిక కార్యకర్త, న్యాయవాది అయిన మోనికా ఆరోరా మాట్లాడుతూ బంగ్లాదేశ్ పరిణామాలపై 4 నెలల పాటు తాము నిర్వహించిన నిజ నిర్ధారణ కార్యాచరణ నివేదికలోని అంశాలను రౌండ్ టేబుల్ ముందుంచారు. ప్రాణాలతో ఉండాలంటే మతం మారాలి లేదా లక్షలాది బంగ్లాదేశ్ కరెన్సీతో జిజియా (లంచం) కట్టాలని డిమాండ్ చేస్తూ బీఎన్పీ పార్టీ కార్యకర్తలు, జమాతే ఇస్లామీ తీవ్రవాదులు రేయింబవళ్లు హిందువులే లక్ష్యంగా వెంటాడున్నారని ఆమె తెలిపారు.
బంగ్లాదేశ్‌ని వీడిన మైనార్టీల ఆస్తుల స్వాధీనంతో పాటు ప్రస్తుతం ఉంటున్న మైనార్టీలు ఆస్తులు అమ్మడానికి వీల్లేకుండా, కనీసం బదలాయింపు చెయ్యకుండా వేధిస్తున్న ఆ దేశ చట్టాల క్రౌర్యాన్ని మోనికా వివరించారు. ప్రస్తుతం పాక్ సర్కారు సైతం బంగ్లాదేశ్‌తో జట్టు కట్టి ఆయుధాలు, బలగాల తరలింపు చేస్తోందని ఆమె ఆందోనళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అరెస్ట్ అయిన ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కేవలం మైనార్టీల రక్షణకు డిమాండ్ చేసినందుకే అరెస్ట్ చేశారని, అందులో భాగంగా మైనార్టీలకు ఒక మంత్రిత్వశాఖ, మైనార్టీల కేసుల విచారణకు ట్రిబ్యునల్, దుర్గాపూజకు అనుకూల వాతావరణం, మైనార్టీలకు గౌరవప్రదమైన జీవనం కోరారని మోనికా వివరించారు. చిట్టగాంగ్ సమావేశంలో బంగ్లాదేశ్ జెండాని తక్కువ ఎత్తులో ఉంచారంటూ చిన్నయ్ పై దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆమె చెప్పారు.
ప్రజ్ఞాభారతి ఛైర్మన్ హనుమాన్ చౌదరి బంగ్లాదేశ్ పరిణామాల నడుమ అక్కడి హిందువులందరినీ భారత్‌లోకి అనుమతించేలా జనాభా మార్పిడి జరగాలని ఆయన సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం ఇదే అంశాన్ని లేవనెత్తారని తెలియజేస్తూ బల్గేరియా పరిణామాలను సభకు వివరించారు. బంగ్లాదేశ్ మారణకాండపై ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని ఆయన స్పష్టం చేశారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందిస్తూ బంగ్లాదేశ్ హిందువుల విషయంలో భారతదేశం వ్యక్తం చేసిన ఆందోళనపై అది తమ ఆంతరంగిక విషయమంటూ బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషిముద్దీన్ చేసిన వ్యాఖ్యల వెనుక అంతరార్ధాన్ని గుర్తించాలని హెచ్చరించారు. ఇది చాలక భారత్‌లోని బెంగాల్, బీహార్, ఒడిషా రాష్ట్రాలను కూడా తీసుకుంటామని బంగ్లాదేశ్‌లోని బీఎన్పీకి చెందిన వ్యక్తులు చేసిన హెచ్చరికల వెనుక ఎవరున్నారో గ్రహించాలని ఆయన తెలిపారు.