సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే లక్ష్యం అని ప్రకటించిన ప్రభుత్వ పాలనలో గుడులపై వివక్ష ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు. దాన్ని నిరూపిస్తూ స్టాలిన్ సర్కారు తాజాగా వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.
చెన్నైలో ప్రఖ్యాత కపాలీశ్వర స్వామి గుడి పుష్కరిణి మెట్ల మీద దీపాలు పెట్టడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దానికి డిఎంకె చెప్పిన సాకు ఏమిటో తెలుసా? మెట్లమీద నూనె దీపాలు పెడితే ఆ కాలుష్యానికి పుష్కరిణిలో చేపలకు ప్రమాదమట, నీరు కలుషితం అయిపోతుందట. డిఎంకె ప్రభుత్వం ఉత్తర్వులపై భక్తులు, హిందూ సంస్థలు మండిపడుతున్నాయి.
తమిళనాడు సంప్రదాయం ప్రకారం ఇప్పుడు కార్తికమాసం నడుస్తోంది. ఆ సందర్భంగా ఇవాళ ‘తిరుకార్తికై’ అనే పండుగ చేసుకుంటారు. కార్తిక దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదులుతారు. దేవాలయాల్లో పుష్కరిణి గట్ల మీద పెడతారు. దానివల్ల వాతావరణం పరిశుభ్రం అవుతుందని, శీతాకాలంలో వచ్చే వ్యాధులు నియంత్రణ అవుతాయనీ భావిస్తారు. అయితే తమిళనాడు దేవదాయశాఖ మాత్రం దీపాలు పెట్టడం వల్ల జలచరాలకు హాని కలుగుతుందని వింత వాదన చేస్తోంది. గుడుల్లో ఉండే పుష్కరిణుల దగ్గర దీపాలు పెట్టినప్పుడు ఆ నూనె వల్ల నీరు కలుషితం అవుతుందని, దాంతో చేపలు ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటాయనీ, పెద్దసంఖ్యలో చేపలు చచ్చిపోతాయనీ తమిళనాడు మత్స్యవిభాగం ప్రకటించింది. అలాగే భక్తులు దేవాలయాల పుష్కరిణుల్లో స్నానాలు చేయకూడదనీ, చేపలకు ఆహారం వేయకూడదనీ సూచించింది. అలా చేస్తే దేవాలయాల్లో ఉండే పుష్కరిణులు కలుషితమైపోతాయట.
డిఎంకె ప్రభుత్వం విధించిన ఈ నిషేధంపై భక్తులు, హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఉద్దేశపూర్వకంగా హిందువుల ఆచార వ్యవహారాలను లక్ష్యం చేసుకుని దాడి చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసాయి. దీపాలు పెట్టడం వల్ల కాలుష్యం పెద్దగా ఉండదని, అయితే హిందువుల ఆచారాలను అడ్డుకోవడమే లక్ష్యంగా డిఎంకె ప్రభుత్వం నిషేధం విధించిందనీ హిందూ మున్నాని నాయకులు ఎలంగోవన్, బ్రహ్మనాయగం ఆవేదన చెందారు. దర్శనాలకు టికెట్లు, ఆచారాలపై ఆంక్షలతో సాధారణ భక్తులకు దేవతారాధనను దూరం చేస్తూ ఆలయాలను దర్శించాలనుకునే భక్తులను నిరుత్సాహపరిచే కుట్రను డిఎంకె అమలు చేస్తోందని ఆరోపించారు. కేవలం హిందూ పర్వదినాల వేళల్లో మాత్రమే పర్యావరణం గుర్తొస్తుందని, ఇతర మతాల పండుగల వేళ అలాంటి ఆంక్షలేమీ విధించరనీ, ఇది కేవలం డిఎంకె ప్రభుత్వపు ద్వంద్వ వైఖరి అనీ విమర్శకులు దుయ్యబడుతున్నారు. ముస్లిముల పండుగల్లో జంతువధ విపరీతంగా జరుగుతుంది. అలాంటప్పుడు మాత్రం డిఎంకె సర్కారు నోరెత్తదని గుర్తుచేసారు.
అరుణాచలం వద్ద ఆంక్షలు:
తమిళనాడు దేవదాయ శాఖ మంత్రి పి.కె.శేఖర్ బాబు రెండురోజుల క్రితం మరో ప్రకటన చేసాడు. ఇటీవల కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడిన సందర్భాలను ఉదాహరణగా చూపుతూ, అరుణాచలంలో మహాదీపం పర్వదిన వేళ అరుణగిరి పర్వతం మీదకు భక్తులు ఎక్కకూడదంటూ ఆదేశాలు జారీ చేసాడు. నిపుణుల సిఫారసుల మేరకే ఆ ఉత్తర్వులు ఇచ్చామని సాకులు చెప్పాడు. అయితే దేవదాయ శాఖ నిలకడలేని వ్యవహారశైలికి అది నిదర్శనంగా నిలిచిందని విమర్శకులు మండిపడుతున్నారు. దేవాలయాల విషయంలో న్యాయస్థానాలు ఇచ్చే పలు ఉత్తర్వులను ఏనాడూ పట్టించుకోని, దేవాలయాల భూముల ఆక్రమణల మీద, ఆస్తుల అన్యాక్రాంతం మీద ఏ చర్యలూ తీసుకోని దేవదాయ శాఖ భక్తుల ఆచార వ్యవహారాలపై ఆంక్షలు విధించడంలో మాత్రం ముందుంటోందని విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.