Mohan Bhagwat |
‘మనందరం వేర్వేరుగా ఉంటాం, కానీ కలిసుంటాం. పాశ్చాత్యుల అభిప్రాయాలు అలా ఉండవు. బలమైనదే మనగలదు, ఎవరికి వారే యమునాతీరే, నా అవసరాల సంగతి నేను చూసుకుంటాను – నీ అవసరాల సంగతి నువ్వు చూసుకో, నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను… ఇలా స్వార్థపూరితంగా ఉంటాయి. ప్రకృతికి ఏం జరిగినా, పర్యావరణం పాడైపోయినా తమకు సంబంధం లేదన్నట్టు ఉంటారు. ప్రకృతిని నాశనం చేస్తే, నేను బతకాలి కాబట్టి అందులో తప్పేమీ లేదు అంటారు. కానీ భారతదేశం దానికి పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తుంది. మనం మనకంటె ముందు ఎదుటివారి గురించి ఆలోచిస్తాం’’ అని చెప్పారు ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్. గురువారం నాడు పుణేలో సంజీవన్ వ్యాఖ్యానమాల సంస్థ 23వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
‘ఉత్క్రాంతి’ (పైకి చేరడం) గురించి మాట్లాడుతూ భాగవత్ ఇలా చెప్పుకొచ్చారు. ‘‘ప్రకృతికి ఒక పద్ధతి ఉంటుంది. ఆహార గొలుసును చూస్తే పెద్ద చేపలు తాము బతకడానికి చిన్న చేపలను తింటాయి. ‘జీవో జీవస్య జీవనం’. ఆహార గొలుసులో అన్నిటికంటె పైన ఉండే జీవి రాజులా ఉంటుంది. కానీ ఉత్క్రాంతి తర్వాత ఆహార గొలుసులో అట్టడుగున ఉన్న జీవి అయిన మానవుడు అన్నిటికంటె పైస్థానానికి చేరుకున్నాడు, తన సొంత అవసరాల కోసం ప్రకృతిలోని సహజ వనరులు అన్నింటినీ ధ్వంసం చేసేసాడు. ‘మనందరం వేర్వేరు కాబట్టి నేను ఎవరికోసమూ పట్టించుకోను, మనుగడలో ఉండడానికి నేను బలంగా ఉండాలి. దానికి నేను అన్నింటినీ తినెయ్యాలి. దానిగురించి పెద్దగా ఆలోచించడం అనవసరం. నా దారిలో అడ్డొచ్చే వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే నా పని’ ప్రకృతి ఇలాగే పనిచేస్తుందని భావించి, మనిషి గత 2000 సంవత్సరాలుగా ఇదేవిధంగా జీవిస్తున్నాడు’’.
మోహన్ భాగవత్ మానవాళి పరిణామ క్రమం గురించి చెబుతూ… మానవులు పుట్టుకతోనే అణగారిన వారిపై ఆధిపత్యం చెలాయించాలి అనే నైజంతోనే పుట్టారు. దాన్నే రాక్షస ప్రవృత్తి అంటారు. మానవుడలో అహం వల్లనే రాక్షస ప్రవృత్తి అలవడుతుంది. దానికి వ్యతిరేకం దేవ ప్రవృత్తి. మనతో పాటు మిగతావారు కూడా శాంతియుతంగా జీవించవచ్చు. అవసరంలో ఉన్నవాడిని మనం కాపాడతాం అనే ధోరణినే దేవ ప్రవృత్తి అంటారు… అని చెప్పారు.
‘‘మనం ఎవరం, మన ఉనికి ఏమిటి అనే విషయం మీద ఘర్షణ అక్కర్లేదు. అన్ని జీవులనూ మన సొంతంగానే మనం ఎప్పుడూ చూస్తూ వచ్చాం. శతాబ్దాల తరబడి మనం జీవించిన విధానం మనకు ఇతరుల సౌకర్యం గురించి ఆలోచించమనే చెప్పింది. భారతదేశంలో ‘నేను అనుకున్నదే సరైనది’ అనుకోడాన్ని సహించే పద్ధతి లేదు. ఇతరుల విశ్వాసాన్ని ఎంత గౌరవిస్తానో, నా విశ్వాసానికి నేను అంతే అంకితభావంతో ఉంటాను. కాబట్టి బలవంతంగా మతం మార్చడం, దానికోసం దేవీ దేవతలను అవమానించడాన్ని సహించే ప్రసక్తే లేదు. అది మన జాతీయ విధానంలో భాగం ఎంతమాత్రం కాదు’’ అని మోహన్ భాగవత్ స్పష్టం చేసారు.
ఆయన ఇంకా ఇలా చెప్పుకొచ్చారు. ‘‘అనుమానం అక్కర్లేదు. మనం హిందువులం కాబట్టే, డిసెంబర్ 25ను రామకృష్ణ మిషన్లో వేడుక చేస్తాం. అది మనలో సహజంగా ఉన్న లక్షణం. అనాదికాలం నుంచీ మనం ఇతరులతో సామరస్యంగా జీవిస్తున్నాం. ఆ సామరస్య భావన మనలో ఉంది. హిందువులు తమ ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి ఎంతో తాదాత్మ్యం చెందుతారు. కానీ అలాంటి మనోభావాల కారణంగా ప్రతీరోజూ ఓ కొత్త అంశాన్ని ముందుకు తెస్తే ఏం జరుగుతుంది? అలా కొనసాగడం సాధ్యం కాదు. మనం ఒకరితో ఒకరు కలిసిమెలిసి సామరస్యపూర్వకంగా బతకగలమని చూపించాలి అనుకుంటే, ప్రపంచం అనుసరించడానికి మనం ఒక నమూనాను ఇవ్వాలి’’.
భారతదేశం వెలుపల నుంచి వచ్చిన కొన్ని సిద్ధాంతాలు ఇతరుల పట్ల అసహనంగానే ఉంటాయని మోహన్ భాగవత్ చెప్పారు. ‘‘వాళ్ళు చరిత్రలో కొంతకాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించారు, కాబట్టి మళ్ళీ పరిపాలించడానికి తమకు హక్కు ఉందని భావిస్తున్నారు. కానీ మన దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని వారు మరచిపోయారు. ఇక్కడ ఎవరూ ఎవరిమీదా అధికారం చెలాయించలేరు. ప్రజలు తమకు నచ్చిన అభ్యర్ధిని ఎన్నుకుంటారు, వారు ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ప్రజలే నిజమైన పాలకులు. రాజరికం, ఆధిపత్యాల రోజులు ఎప్పుడో పోయాయి. మనం పాతకాలపు ఘర్షణలను మరచిపోవాలి, ప్రతీ ఒక్కరినీ చేతులు చాచి ఆహ్వానించి అంగీకరించాలి. మన సంస్కృతి మనకు నేర్పించింది ఏంటంటే మనం ఇతరులను యథాతథంగా అంగీకరిస్తాం, వారి విశ్వాసాలు, నమ్మకాలతో సహా వారిని ఆమోదిస్తాం. కానీ పదేపదే పదేపదే మనం వెన్నుపోట్లకు గురవుతూనే ఉన్నాం. చివరి వెన్నుపోటు ఎప్పుడంటే.. ఈ యేకీకరణ ప్రారంభమైనప్పుడు ఔరంగజేబు ఔరంగజేబు తన సోదరుడు దారా షికోని, అతనిలాంటి వారినీ చంపేసాడు. దాంతో మళ్ళీ అసహనం తెరలుతెరలుగా మళ్ళీ వచ్చింది.’’
‘‘ఆ తరంగం 1857లో మళ్ళీ వచ్చింది. ఈ జనాలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కానీ విదేశీ పీడకుడు మీద పడినప్పుడు వాళ్ళు కలిసిపోతారు అని బ్రిటిష్ వాడు చూసాడు. కాబట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉండడమే మంచిది, విభజించి పాలించడమే ఉత్తమం అని ఆలోచించాడు. దానివల్ల పాకిస్తాన్ ఏర్పడింది. మనం స్వతంత్ర భారతంలో భారతీయులుగా జీవిస్తున్నాం. మనందరం ఒకటి. అలాంటప్పడు ఈ తేడాలు, ఆధిక్యం, ఆదిపత్యం అన్న చర్చలేమిటి? మైనారిటీలు – మెజారిటీలు ఎవరు? మనమంతా సమానులం. కాబట్టి మనం అసహనాన్ని మరచిపోవాలి. అన్నింటినీ కలుపుకునిపోయే మన దేశ సంస్కృతికి అనుగుణంగా ఉండాలి. ఈ సంస్కృతిని పరిరక్షించేవారు ఒక విషయం తప్పక గుర్తుంచుకోవాలి. మనం సంఘటితంగా, వ్యవస్థీకృతంగా లేము కాబట్టే భయం కలుగుతుంది. కలిసికట్టుగా ఉంటే బలంగా ఉంటాం. మీ సామర్ధ్యాన్ని పెంచుకోండి. ఎంతలా అంటే, మిమ్మల్ని భయపెట్టాలి అనుకునేవారు, మీరు మీ కాళ్ళ మీద లేచి నిలబడడం చూసి భయపడాలి. కానీ మీ అంతట మీరు ఎవరినీ భయపెట్టకూడదు. అలాంటి భారతీయులుగా ఉండండి’’ అని చెప్పారు.
‘‘మన దేశాన్ని తెల్లవాడు సృష్టించలేదు. ఇది సనాతనం, ఇది ఎప్పుడూ ఉంది. ఈ విషయం రాజకీయం కాదు. ఇది ధర్మానికి, సంస్కృతికి, సత్యానికీ చెందిన విషయం. మన దేశానికి పునాది ధర్మం. అది ఈ విశ్వం సృష్టించబడినప్పటి నుంచీ ఉంది. మనది ధర్మాధారిత దేశం, ప్రపంచానికి ధర్మాన్ని బోధించే దేశం. ఆ విషయం మన మనసుల్లో ఎప్పుడూ స్పష్టంగా ఉండాలి. ఆ విషయంలో రెండో ఆలోచనకు తావే లేదు. మనం కలిసి ఉండాలంటే అందరం ఒకేలా ఉండాలి అన్నది విదేశీ భావన. మనం భిన్నత్వాన్ని గౌరవిస్తాం, అదే ఏకత్వానికి అలంకారం అని భావిస్తాం. దాన్ని గౌరవించాలి, ఆమోదించాలి. మన ప్రత్యేకతను గౌరవించుకుందాం, ఇతరుల ప్రత్యేకతను ఆమోదిద్దాం. అలాంటి అన్ని భిన్నత్వాలతోనూ మన దేశం ఐకమత్యంగా ఉంటుంది. మన స్వభావం కూడా అదే కావాలి’’ అని మోహన్ భాగవత్ చెప్పారు.
‘‘అన్నిటి కంటె ప్రధానమైన విషయం… మన పాత్ర ఏమిటన్నది మన మనసుల్లో స్పష్టమయ్యాక, అది మన కార్యాచరణలో ప్రతిఫలించాలి. ఒకటి చెప్పడం, దానికి విరుద్ధంగా మరొకటి చేయడం అనేది పూర్తిగా పిరికితనం. నిజానికి అహంకారం వల్లనే అలా ప్రవర్తిస్తారు. ప్రపంచమంతా అలాగే జరుగుతోంది, నేను ప్రత్యేకించి పేర్లు చెప్పనక్కరలేదు. కులాలు, వివక్ష గురించిన ఆలోచనలను కట్టకట్టి విసిరి పారేయాలి. అది మన ఇళ్ళలోనూ ఉండాలి. గత వెయ్యి, పన్నెండువందల యేళ్ళలో మనం ఎన్నో అధార్మిక పద్ధతులను అనుసరించాం. చాలాసార్లు తెలియక, దాన్నే ధర్మం అనుకుని, కొన్నిసార్లు స్వార్థంతో అలాంటి పనులకు పాల్పడ్డాం. అలాంటి అధర్మాన్ని మన జీవితాలలోనుంచి తొలగించివేయాలి. ఋషులు చెప్పిన పద్ధతిని పాటించాలి. పండితులు చెప్పే విషయాలు వినాలి, తెలుసుకోవాలి. కానీ సాధు సంతులు చెప్పిన విషయాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ధర్మం, సంస్కృతి అనే వాటిని సృష్టించడం వెనుక నిజాలు ఏమిటో వారికే తెలుసు. నిరంతరం సత్యంతో సంపర్కంలో ఉండే వారే నిజమైన ఆత్మసాక్షాత్కారం కలిగినవారు. అలాంటి వారు నేటికీ ఉన్నారు. అలాంటి సంప్రదాయం నిరంతరంగా కొనసాగుతూ ఉండడం భారతదేశపు అదృష్టం’’ అని మోహన్ భాగవత్ చెప్పారు.