కర్నాటక అసెంబ్లీలో వున్న భారత స్వాతంత్ర సమర యోధుడు సావర్కర్ చిత్రపటాన్ని తొలగించాలని కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
స్వాతంత్ర ఉద్యమంలో వీరసావర్కర్ పాత్ర ఏమీ లేదని, చిత్ర పటాన్ని తొలగించాలని సిద్దరామయ్య భావించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2022 లో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సావర్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ తీవ్రంగా తప్పుబట్టారు. సావర్కర్ ను కాంగ్రెస్ తీవ్రంగా అవమానపరుస్తోందని, దీనికి తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. టిప్పు సుల్తాన్ జయంతిని జరుపుకుంటారు కానీ.. స్వాతంత్రం కోసం తీవ్రంగా పోరాడిన సావర్కర్ గొప్పతనాన్ని మాత్రం కాంగ్రెస్ దిగజార్చుతోందని దుయ్యబట్టారు. మరి స్వాతంత్రోద్యమంలో నెహ్రూ చేసిన పోరాటం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
2022 లో బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో సావర్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సిద్దరామయ్య నేతృత్వంలో అసెంబ్లీ బయట ఆందోళన నిర్వహించింది. ప్రదర్శన కూడా నిర్వహించింది. అయితే గత శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సావర్కర్ చిత్రపటాన్ని తొలగించాలని సిద్ధరామయ్య నిర్ణయించుకున్నారు. కానీ… కార్యరూపం దాల్చలేదు. తాజాగా మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది.
సిద్ధరామయ్యకి చరిత్ర తెలియదా? జాతీయవాదుల ఆగ్రహం
వీర సావర్కర్ పాత్ర భారత స్వాతంత్రోద్యమంలో లేదని, అందుకే కర్నాటక అసెంబ్లీ నుంచి ఆయన చిత్రపటాన్ని తొలగించాలని సిద్దరామయ్య నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే ముఖ్యమంత్రి సిద్దరామయ్యకి చరిత్ర తెలియదని అర్థం. భారత స్వాతంత్ర పోరాటాన్ని అవమానపరుస్తున్నట్లే భావించాల్సి వుంటుంది. భారత స్వాతంత్రోద్యమంలో సావర్కర్ పాల్గొన్నందుకు విశ్వవిద్యాలయం ఆయన బారిస్టర్ డిగ్రీనే రద్దు చేసింది. అంతేకాకుండా ఆయన ధాటిని తట్టుకోలేకే బ్రిటీష్ ప్రభుత్వం అండమాన్ లో కారాగార శిక్ష విధించింది. వినాయక్ దామోదర్ సావర్కర్‌కు న్యాయస్థానం అండమాన్ జైలులో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు (50 ఏళ్లు) విధించింది. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటిరచగానే. ‘బ్రిటిష్ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట’ అని చమత్కరించిన ధీశాలి. 1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు వలవడం, గానుగ ఆడించి నూనె తీయడం వంటి కఠిన పనులు చేయించారు.