Chandrashekhar Swamiji |
జైలుకైనా వెళ్తాను.. నోటీసులెందుకో అర్థమే కాలేదు : చంద్రశేఖర స్వామీజీ
ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలన్న వ్యాఖ్యలపై పోలీసు నోటీసులపై విశ్వఒక్కలిగ మహా సంస్థానం మఠాధిపతి చంద్రశేఖర స్వామీజీ స్పష్టం చేశారు. అలాగే విచారణకు పోలీసులు పిలిచారని, నోటీసులిచ్చారని, ఈ విషయంలో తాను జైలుకైనా వెళ్లేందుకు సిద్ధంగా వున్నానని ప్రకటించారు. ఈ విషయాన్ని తాను దేవుడికే వదిలేస్తున్నానని స్పష్టం చేశారు.
‘‘నేను జైలుకెళ్లేందుకు కూడా సిద్ధంగా వున్నా. రైతుల భూములను లాక్కునేందుకు వక్ఫ్ సిద్ధమైంది. దీనిని వ్యతిరేకిస్తూ రైతులు నిర్వహించిన నిరసనలో పాల్గొన్నా. పోలీసు విచారణకు నేను వెళ్లను. ఒకవేళ వారు తమ మఠానికి వస్తే మాత్రం... కచ్చితంగా పోలీసులతో మాట్లాడి... స్పష్టతనిస్తాను.నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు. నోరు జారాను అంతే. మరుసటి రోజే విచారం వ్యక్తం చేస్తూ... ఓ ప్రకటన కూడా విడుదల చేశా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం." అని స్వామీజీ అన్నారు.
తమ మఠానికి కొందరు ముస్లింలు కూడా భక్తులుగా వున్నారని స్వామీజీ తెలిపారు. తాను ముస్లింల వివాహాలకు కూడా హాజరవుతానని, అసలు తనపై ఫిర్యాదు ఎందుకు నమోదైందో అర్థం కావడం లేదని వాపోయారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, తనను కలవడానికి కొందరు వచ్చారన్నారు.అయితే ప్రస్తుత విషయాలపై మాత్రం ఆందోళనపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చేయాలని విశ్వ ఒక్కలిగ మహాసంస్థానం మఠాధిపతి చంద్రశేఖర స్వామీజీ డిమాండ్ చేశారు. రైతుల భూములకు వక్ఫ్‌బోర్డు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘం కర్ణాటక విభాగం బెంగళూరులోని ఫ్రీడం పార్కులో ఏర్పాటు చేసిన ధర్నాలో ఆయన మాట్లాడారు. దేశంలో వక్ఫ్ బోర్డును లేకుండా చేస్తే భారతీయులంతా ప్రశాంతంగా ఉండడం సాధ్యమన్నారు. ఒకరి భూమిని మరొకరు లాక్కోవడం ధర్మం కాదన్నారు. ప్రభుత్వం పతనమైనా ఫర్వాలేదుగానీ వక్ఫ్‌బోర్డు రద్దు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.