ట్రాన్స్‌జెండర్ ముసుగులో ఏడేళ్ళ బాలికను రేప్ చేసిన ఫరీన్ అహ్మద్ అనే దుర్మార్గుడికి న్యాయస్థానం 20ఏళ్ళ కఠిన కారాగార శిక్ష, రూ.12వేల జరిమానా విధించింది. ఉత్తరప్రదేశ్‌లో రెండేళ్ళ క్రితం జరిగిన అత్యాచారం కేసులో న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
బరేలీ జిల్లాకు చెందిన ఫరీన్ అహ్మద్ అనే వ్యక్తి హిజ్రాలా నటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉండేవాడు. 2022 మార్చి 29న అతను ఒక ఏడేళ్ళ పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తెలిసినవాళ్ళ ఇంటికి టీవీ చూడడానికి వెళ్ళిన చిన్నారిని, తినడానికి దోసకాయలు ఇస్తానని ప్రలోభపెట్టి తనతో తీసుకువెళ్ళి పాడుచేసాడు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
బాధిత బాలిక 2022 మార్చి 27 మధ్యాహ్నం నిందితుడి ఇంటికి టీవీ చూడడానికి వెళ్ళింది. అయితే, మర్మాంగాల నుంచి రక్తమోడుతూ ఇంటికి వచ్చింది. బాలిక తల్లి ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. పన్నెండు రోజుల పాటు చికిత్స జరిగింది. సంఘటన జరిగిన రోజే బాధిత బాలిక తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ‘‘ఫరీన్ అహ్మద్ నా కూతురిని రేప్ చేసాడు. దానిగురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. నా కూతురు రక్తమోడుతూ ఇంటికి వచ్చింది. ఆస్పత్రిలో రెండువారాలు చికిత్స జరిగింది’’ అని బాధితురాలి తల్లి ఎఫ్ఐఆర్లో వివరించింది.
పోలీసులు జూన్ 22న చార్జిషీట్ దాఖలు చేసారు. అయితే నిందితుడు హిజ్రా అని, ఒక మహిళలా జీవిస్తున్నాడనీ డిఫెన్స్ అటార్నీ వాదించాడు. తాను పుట్టుకతో హిజ్రాననీ, రేప్ చేయలేననీ నిందితుడు కోర్టుకు చెప్పాడు. అయితే న్యాయస్థానం అతనికి వైద్యపరీక్షలు చేయించింది. జెండర్ టెస్ట్‌లో ఫరీన్ హిజ్రా కాదనీ, పూర్తిస్థాయి మగాడేననీ తేలింది. ఆ విచారణలో ఫరీన్ చాలాకాలంగా హిజ్రా వేషంలో ప్రజలను మోసం చేస్తున్నాడని బైటపడింది.
కేసును విచారించిన బరేలీ పోక్సో స్పెషల్ కోర్టు, మైనర్ బాలికపై లైంగిక అఘాయిత్యానికి పాల్పడిన నేరానికి ఫరీన్ అహ్మద్‌కు 20ఏళ్ళ జైలుశిక్ష, రూ.12వేల జరిమానా విధించింది. జరిమానా కట్టకపోతే మరో యేడాది జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.