సరిహద్దుల వద్ద ఒప్పందాలను తరుచూ ఉల్లంఘించే చైనా ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. అది కూడా హిందువులకు అత్యంత పవిత్రమైన రామాయణ గ్రంథం గురించి కీలక విషయం చెప్పారు. శతాబ్దాలుగా వున్న బౌద్ధ గ్రంథాలలో రామాయణ కథల ఆనవాళ్లు చైనాలో స్పష్టంగా గోచరిస్తున్నాయని చైనా పండితులు వెల్లడించారు. చైనా చరిత్రలో హిందూ మత ప్రభావం వుందని ఒప్పుకోవడం ఇదే ప్రథమం. భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ‘‘రామాయణం- ఎ- టైమ్ లెస్ గైడ్’’ అనే అంశంపై సెమినార్ జరిగింది. దీనిలో అనేక మంది చైనా పండితులు పాల్గొన్నారు. వివిధ మార్గాల్లో రామాయణం చైనాలోకి ఎలా వచ్చింది, చైనా కళలు.. సాహిత్యంపై ఎటువంటి ప్రభావం చూపించిందన్న అంశాలను వివరించారు.
మతపరమైన అలాగే లౌకిక ప్రపంచాన్ని పెనవేసుకునే క్లాసిక్ గా, క్రాస్ కల్చరల్ ట్రాన్స్ మిషన్ ద్వారా రామాయణ ప్రభావం మరింత గణనీయంగా పెరిగిందని సింఘువా విశ్వవిద్యాలయంలోని ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ ఏరియా స్టడీస్ ప్రొఫెసర్ డాక్టర్ జియాంగ్ జింగ్కుయ్ అన్నారు. ఇతిహాసాల్లో వుండే ఈ విషయాలన్నింటిని చైనా కూడా గ్రహించిందని కూడా ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన అనేక సాక్ష్యాలను కూడా ఆయన ఈ సెమినార్ ముందు వుంచారు. ఇది చైనీస్ (మెజారిటీ) హాన్ సంస్కృతిలో జాడలను వదిలివేయడమే కాకుండా, చైనీస్ జిజాంగ్ (టిబెటన్) సంస్కృతిలో పునర్నిర్వచించబడింది మరియు కొత్త అర్థాన్ని కూడా ఇచ్చిందని చెప్పాడు.
బౌద్ధం ముమ్మరంగా సాగుతున్న సమయంలో బౌద్ధ సాహిత్యంలోని కథల్లో దశరథ, హనుమ అనే పేర్లు కలిగిన పాత్రలు కూడా వుండేవని జియాంగ్ జింగ్ క్యూ చెప్పారు.అయితే సన్ వూకాంగ్ అనే పాత్ర హనుమంతుడిదే అయి వుండొచ్చని, ఆ పాత్ర శైలి, అభిరుచి అన్నీ హనుమంతుడి తరహాలోనే వుంటాయని జియాంగ్ అన్నారు.