వక్ఫ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని హిందూ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. కొచ్చిలో జరిగిన హిందూ ఐక్యవేదిక మహా సభలో ఈ డిమాండ్ చేశారు.
వక్ఫ్ బోర్డు తమ భూములను లాక్కోని, నిర్వాసితులను చేయాలని చూస్తోందని, ఈ అప్రజాస్వామిక ప్రయత్నాలను నిరసిస్తున్నామని పేర్కొంది. ఈ సందర్భంగా మునంబం వాసులకు హిందూ ఐక్యవేదిక తమ సంఘీభావం ప్రకటించింది. మునుంబం వాసులను నిర్వాసితులుగా చేయడమే వక్ఫ్ లక్ష్యమని ఆరపించింది. హిందూ ఐక్యవేదిక నిర్వహించిన నిరసన సభకు వందలాది మంది నిరసనకారులు హాజరయ్యారు. వక్ఫ్ బోర్డుకు నిరసనగా ఓ తీర్మానం కూడా చేశారు. మునంబం ఘటనలో నష్టపోయిన వారికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
ప్రజావ్యతిరేక విధానాల ద్వారా వక్ఫ్ మునంబంలోని ప్రజల భూములను ఆక్రమిస్తోందని తన తీర్మానంలో పేర్కొంది. ఈ అన్యాయమైన పరిణామం 620 కుటుంబాలను విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేసిందని వాపోయింది. తమ చట్టబద్ధమైన ఆస్తి హక్కులను కూడా అటు వక్ఫ్, ఇటు సీపీఎం ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ఈ బాధిత కుటుంబాలన్నీ కొన్ని సంవత్సరాలుగా అక్కడే నివాసం వుంటున్నాయి. అటు సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్, ఇటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ రెండూ కూటములు మునంబం ప్రజలను నిండా ముంచాయని హిందూ ఐక్యవేదిక మండిపడింది. వారి వారి భూములను కాపాడుకునే హక్కు మునంబం ప్రజలకు వుందని హిందూ ఐక్యవేదిక స్పష్టం చేసింది.
వక్ఫ్ డిమాండ్ అన్యాయమని, రాజ్యాంగ వ్యతిరేకమని హిందూ ఐక్యవేదిక పేర్కొంది. దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. నెహ్రూ పాలనలో వక్ఫ్ ను వ్యవస్థలోకి తీసుకొచ్చారని, మైనారిటీ అనుకూల రాజకీయాల కారణంగా, సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా వక్ఫ్ బోర్డుకి విశేష అధికారాలను అప్పటి నెహ్రూ కట్టబెట్టారని మండిపడింది. తర్వాత 1995 మరియు 2013లో చేసిన సవరణలు వక్ఫ్ బోర్డుకు మరింత గొప్ప అధికారాన్ని తెచ్చిపెట్టాయని, దానిని దేశ రాజ్యాంగం కంటే ఉన్నతమైనదిగా చూపిస్తున్నారని ఆక్రోశించింది.
ఇస్లామిక్ దేశాలలో కూడా ఇలాంటి వక్ఫ్ నిబంధనలేవీ లేవని హిందూ ఐక్యవేదిక ఎత్తి చూపించింది.
ప్రస్తుతం వక్ఫ్ బోర్డు తొమ్మిదిన్నర లక్షల ఎకరాల భూమితో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ భూయజమాని అని పేర్కొంది. దీనిని తుంచేయడానికి బలమైన సంఘటన అవసరమని, దీనిని వ్యతిరేకించేవారందరూ ఐక్యం కావాలని హిందూ ఐక్యవేదిక పిలుపునిచ్చింది.ఈ ఏకపక్ష దండయాత్రను ఆపడానికి కేరళ సమాజం మొత్తం ఏకం కావాలని కోరింది. వక్ఫ్ కి వ్యతిరేకంగా కొత్త చట్టం తేవాల్సిందేనని స్పష్టం చేసింది.