జమ్మూ కశ్మీర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలు కావొస్తోంది. అయితే... అక్టోబర్ 16 న ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సమయంలో ప్రాంతీయ వివక్ష వుండదని పరోక్షంగా జమ్మూపై ఎలాంటి వివక్షా చూపమని ప్రకటించారు. ఎందుకంటే ఆ పార్టీ కశ్మీర్ నుంచి ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. కానీ ఒమర్ అబ్దుల్లా ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. ఆయన ప్రకటనలన్నీ బూటకమని తేలిపోయింది. కొన్ని రోజుల క్రితం ఆ ప్రభుత్వం 575 లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సూచించింది.
ఈ 575 పోస్టుల భర్తీలో 36 ఉర్దూ, రెండు అరబిక, నాలుగు పర్షియన్ పోస్టులు వున్నాయి. అయితే... ఇందులో హిందీ, సంస్కృతానికి సంబంధించిన ఒక్క పోస్టూ లేదు. ఇంగ్లీష్ కి 53 పోస్టులున్నాయి. మొత్తం మీద వివిధ భాషలలో 102 లెక్చరర్ల పోస్టులున్నాయి. ఆ పోస్టుల్లో హిందీ, సంస్కృతానికి సంబంధించిన పోస్టులే లేవు. దీనిని జమ్మూపై వివక్ష చూపించడం అని అనడం కాదా? అంటూ జాతీయవాదులు ప్రశ్నిస్తున్నారు. కతువా, సాంబా, జమ్మూ, ఉధంపూర్, రియాసీ జిల్లాల్లో హిందీ, సంస్కృతం మాట్లాడే వారు అధిక సంఖ్యలో వున్నారు. అలాగే ఈ రెండు సబ్జెక్టులను ఎక్కువగా తీసుకుంటారు.
ఒమర్ ప్రభుత్వం చూపించిన ఈ వివక్షపై పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది జమ్మూ ప్రాంతంలోని హిందువుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష అని సనాతన ధర్మ సభ అధ్యక్షుడు పురుషోత్తం దధీచి అన్నారు. ఇదో కుట్ర అని, హిందూ విద్యార్థులను నిరుత్సాహపరిచే చర్య అని మండిపడ్డారు.భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో హిందీ ప్రధాన భాష మరియు దేశవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాష అని ఇక్కడ ప్రస్తావించబడింది. హిందీ భాషను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెడుతున్నట్లు అనిపిస్తోంది. మళ్లీ ఉర్దూను తెరపైకెచ్చి, సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తామని చెప్పకనే చెప్పారు. యాదృచ్ఛికం ఏమిటంటే 2020 వరకూ ఉర్దూ అక్కడ అధికార భాషే.