Venkaiah Naidu at the inauguration of Lok Manthan exhibition |
తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం : లోక్ మంథన్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో వెంకయ్య నాయుడు
భారతీయులందరూ తిరిగి తమ మూలాల్లోకి వెళ్లాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మన భాష,మన వేషధారణ, మన సంస్కృతిని మరిచిపోయామని, తిరిగి ప్రతి ఒక్కరూ మన సంప్రదాయానికి రావాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు.
భారతీయ సనాతన ధర్మం ఎంతో గొప్పదని, మనతో పాటు జంతు జాలాలను కూడా బతికించుకునే సంస్కృతి మనదని కొనియాడారు. భాగ్యనగరం వేదికగా నాలుగు రోజుల పాటు శిల్పారామంలో జరుగుతున్న లోకమంథన్ భాగ్యనగర్ 2024 ఎగ్జిబిషన్ ను వెంకయ్యనాయుడు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాశ్చాత్యులు భారతీయుల మనస్సులను కూడా దోచుకెళ్లారని, అందుకే ఇప్పుడు మనలో మార్పులు వచ్చాయని, మన సంస్కృతిని, మన భాషను, మన సాహిత్యాన్ని, మన సంగీతాన్ని, మన మాటలను, మన వాయిద్యాలను మరిచిపోయి, ఇంగ్లీషు వైపు వెళ్లిపోయామన్నారు. తిరిగి భారతీయ మూలాలకు వెళ్లి, భారతీయ భాషలను ప్రోత్సహించాలని, ముందుకు మాతృభాష వైపు మళ్లాలని, ఆ తర్వాత ఏ భాష వైపు అయినా మళ్లాలన్నారు. తాము ఏ భాషకీ వ్యతిరేకం కాదని, కానీ.. అసలు భాషైన అమ్మ భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అమ్మభాష కళ్లలాంటిదని, ఇంగ్లీషు కళ్లద్దాల్లాంటిదని, కళ్లే లేకపోతే ఎంత మంచి కళ్లద్దాలున్నా దండగేనన్నారు. వలసవాద బుద్ధిని వదిలి, తిరిగి మన మూలాల్లోకి వెళ్లడమే లోకమంథన్ ఉద్దేశమని వివరించారు.
Lok Manthan exhibition |
చీమకి చక్కెర, పాముకి పాలు పోయడం, చెట్టుకు బొట్టు పెట్టే పవిత్ర సంస్కృతి హిందువులది అని పేర్కొన్నారు. కానీ... ఇప్పుడు పాశ్చాత్యమోహంలో పడిపోయామని, బ్రిటీషులు, విదేశీయులు భారత్ పై దండయాత్ర చేసి దోపిడీ చేశారన్నారు. కేవలం ధనాన్ని దోపిడీ చేయడమే కాకుండా భారతీయ మనస్సులను కూడా మార్చేశారని అన్నారు. అందుకే ఇప్పుడు భారతీయులు మన మూలాలను మరిచిపోయి, పాశ్చాత్యం వైపు మళ్లిపోయామన్నారు. అందుకే తిరిగి భారతీయులందరూ మూలాల్లోకి వెళ్లాలని సూచించారు. భాగ్యనగరం వేదికగా జరుగుతున్న లోకమంథన్ కార్యక్రమానికి హైదరాబాద్ వాసులు, చుట్టుపక్కల జిల్లాల వాసులందరూ తరలివచ్చి, మన మూలాలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కూడా మాతృభాషలోనే చదువుకున్నారని, స్వయంగా తాను కూడా ఓ వీధి బడిలో చదువుకున్నానని వెంకయ్య నాయుడు తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ తన చదువుకునే సమయంలో కాన్వెంట్ మొహమే చూడలేదని, అయినా గొప్ప వ్యక్తి అయ్యారన్నారు. తాను ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినా సరే... తన వేషధారణలో మార్పు చేయలేదని ప్రకటించారు. అందుకే మన మాతృభాషను, మన సంస్కృతిని ఆచరించడంలో, హిందువునని ప్రకటించడంలో, మన మన ప్రాంతం చెప్పే సమయంలో సిగ్గు పడొద్దని, అత్యంత గర్వంగా ప్రకటించుకోవాలని సూచించారు.
మనకు పురాతనంగా వస్తున్న సంప్రదాయాలను ఆచరించాలని అన్నారు. మాతృభాషను అందరూ మాట్లాడాలన్నారు. ఇంగ్లీషు వ్యామోహం అస్సలే పనికిరాదన్నారు. మనకు పురాతనం నుంచి వస్తున్న సంగీత సాధనాలకు, సాహిత్యానికి అందరూ గౌరవించాలని, ఆదరించాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విదేశాల్లో వున్న తెలుగు వారు తెలుగును బాగా ఆదరిస్తున్నారని కానీ...మనం మాత్రం ఇక్కడ ఇంగ్లీష్ మోజులో పడ్డామన్నారు. ఈ పంచభూతాల్లో దైవత్వాన్ని చూసే సంప్రదాయం హిందువులదని, అలాగే బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసాశ్రమంఅన్న చతురాశ్రమ ధర్మాలను కూడా హిందూ ధర్మం బోధించిందన్నారు.
ప్రకృతితో అందరూ స్నేహపూర్వకంగా వుండాలని, సంస్కృతిని కూడా ఆచరిస్తూ పోతే... అందరి జీవితాలు బాగుంటాయన్నారు. చిన్నతనం నుంచే పిల్లలను కష్టపడే తత్వం నేర్పించాలని, శారీరిక శ్రమ చేయాలన్నారు. యోగ ద్వారా యోగ్యులవుతారని అన్నారు. యువకులందరూ శారీరకంగా బలిష్ఠంగా వుంటేనే మానసికంగా దృఢంగా వుంటారన్నారు. హిందూ సంప్రదాయానికి కుటుంబ వ్యవస్థే కీలకమని వెంకయ్యనాయుడు అన్నారు. కుటుంబ వ్యవస్థను పటిష్ఠంగా వుంచుకోవాలన్నారు. కుటుంబంలో వుండే పెద్దవారితో సమయం గడపాలని సూచించారు. కుటుంబ వ్యవస్థ భారతీయతకే ప్రత్యేకత అని, అప్పుడే ప్రపంచానికి ఆదర్శంగా వుంటామని వెంకయ్య నాయుడు అన్నారు.