Let's achieve a separate Christian state... Mizoram CM is causing a stir |
ఈశాన్య భారతంలోని క్రైస్తవ మెజారిటీ వున్న ప్రాంతాల్లోని రాజకీయాలను నియంత్రించడానికి క్రైస్తవ మిషనరీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని జాతీయవాదులు, సంస్థలు ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తున్నాయి. మయన్మార్ తో కంచె వేయడం విషయంలోనూ, మణిపూర్ లోని స్థానిక మైథీలకు ఎస్టీ హోదా కల్పించే విషయంలో, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో క్రైస్తవ ఓటింగ్ సరళి... ఇలా ప్రతి విషయంలోనూ క్రైస్తవ మిషనరీలు జోక్యం చేసుకుంటున్నాయి. జనాలను ప్రభావితం చేస్తున్నాయి.
వీటన్నింటితో పాటు 2023 మిజోరం అసెంబ్లీ ఎన్నికలను కూడా చర్చి తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇది కాస్త సీఎం లాల్దుహోమా నేతృత్వంలోని అధికార జోరం పీపుల్స్ మూవ్ మెంట్ కి బాగా ప్రయోజనం చేకూరింది. చర్చి ప్రభావం కారణంగా, దాని ఫలితంగా సీఎం లాల్దూహోమా ప్రభుత్వం క్రైస్తవ మిషనరీల అంచనాలకు అనుగుణంగానే నిర్ణయాలు కూడా తీసుకోవడం ఆలోచించాల్సిన విషయం.
తాజాగా సీఎం లాల్దూహోమాకి సంబంధించి ఓ దిగ్భ్రాంతికర వార్త వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ మాసంలో ఆయన అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడున్న మిజోరాం కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘మనమందరమూ ఒకే కుటుంబం. విడివిడిగా వుండొద్దు. ఆ దేవుడి బలంతో ఒక దేశంగా ఏర్పాడాలన్న మన కల నెరవేరుతుంది. నిజమైన దేశానికి సరిహద్దులుండవు. మనల్ని బలవంతంగా విడదీశారు. దీంతో మనం మూడు దేశాల్లోని మూడు విభిన్నమైన ప్రభుత్వాల కింద బతుకుతున్నాం.
ఈ అన్యాయాన్ని మనం అంగీకరించొద్దు. ఇంత జరిగినా... మనం ఒకే మట్టిలోంచి వచ్చాం. మనల్ని విడదీయడానికి ప్రయత్నించే ఊసరవెల్లిలు లేరు. ఇది నిజంగా మనకు దేవుడిచ్చిన వరం. ఈ ఏకీకరణ లక్ష్యం కోసం పనిచేద్దాం. దేవుడు మనకు ఏదో రకంగా సాయం చేస్తాడు. బైబిల్ లో చెప్పినట్లు బలం, శక్తి, అధికారంతో కాదు.. స్ఫూర్తితో మీకు అండగా వుంటా అని బైబిల్ లో ఆ దేవుడు చెప్పినట్లు....ఈ కష్టతర ప్రయత్నంలో దేవుడు మనకు అండగా వుంటాడు మంచైనా, చెడైనా మనం ఆయన దగ్గరే ఆశ్రయం పొందుతాం. ఈశాన్య రాష్ట్రాల్లో చర్చిలు ఏర్పాటు చేసిన వివిధ సంస్థలు, అంతర్జాతీయంగా వున్న క్రైస్తవ మిషనరీలు గురించి కూడా సీఎం మాట్లాడారు. ఇన్ని విభిన్న సంస్థలున్నా.. అన్నీ కలిసి NUA (Network for Unity Association) ఏర్పాటు చేశాయి. అందర్నీ కలపాలని చూస్తోంది.’’ అంటూ సీఎం ప్రసంగించారు.
ఈ ప్రసంగంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం హోదాలో వున్న వ్యక్తి ఇలా ప్రత్యేక దేశం కోరడం ఎవరూ ఊహించలేదు. ఇది కచ్చితంగా దేశ సార్వభౌమత్వానికి, అఖండతకు గొడ్డలిపెట్టు. ప్రత్యేక దేశం అంటూ మాట్లాడటం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.