దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ముస్లిమేతర విద్యార్ధులపై వివక్ష చూపుతున్నారనీ, వారిని వేధిస్తున్నారనీ వచ్చిన ఆరోపణలపై నిజనిర్ధారణ కమిటీ చేసిన దర్యాప్తులో పలు విభ్రాంతికర విషయాలు బైటపడ్డాయి.
పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, అత్యాచారాలకు గురవుతారనీ బెదిరించి విద్యార్ధులను మతం మారాలంటూ ఒత్తిడి చేసిన సంఘటనలు వెలుగు చూసాయి. హిందూ ఉద్యోగులను సైతం రకరకాలుగా భయపెట్టి మతం మార్చడానికి బలవంతపెట్టారు. మతమార్పిడి ఒత్తిళ్ళకు గురైన 27మంది ముస్లిమేతరులు నిజనిర్ధారణ కమిటీ ముందు తమ అనుభవాలను వివరించారు. విశ్వవిద్యాలయంలోని మతపరమైన వివక్షను, మతమార్పిడి ప్రయత్నాలనూ ధ్రువీకరించారు.
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నజీమ్ హుసేన్, వర్సిటీలో పనిచేసే ఒక దళిత ఉద్యోగికి వారి పిల్లలకు ఉద్యోగాలిస్తామంటూ మతం మారాలని ప్రలోభపెట్టాడు. ఆ విషయాన్ని ఆర్గనైజర్ పత్రిక 2024 జులై 17న బైటపెట్టింది. దాంతో పెద్ద వివాదమే చెలరేగింది. కేంద్రప్రభుత్వ నిధులతో నడుస్తున్న మైనారిటీ విద్యాసంస్థలో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ నివేదికను కూడా కొన్ని నెలల పాటు బైటకు రానీయకుండా ఆపగలిగారు.
2024 అక్టోబర్ 26న ఆర్గనైజర్ పత్రిక మరో విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. విశ్వవిద్యాలయంలోని దివ్యాంగురాలైన ఒక మహిళను మతం మార్చడానికి బలవంతపెట్టారు. ‘హిజాబ్ ధరిస్తే మీ ముఖంలో దివ్యమైన వెలుగు వస్తుంది’ అంటూ ఇస్లామిక్ సంప్రదాయాలను అనుసరించేలా ఒత్తిడి చేసారు. ఆ విషయం వెలుగు చూడడంతో విశ్వవిద్యాలయ నిర్వహణపై ఆందోళనలు మొదలయ్యాయి. యూనివర్సిటీ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడంతో పాటు నిర్వహణ ప్రాధమ్యాలను సైతం మార్చాలన్న డిమాండ్లు పెరిగాయి. బహిరంగ ప్రదర్శనలు, ఆందోళనల రూపంలో ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో దర్యాప్తు కమిటీ ఎట్టకేలకు తమ నివేదికను ఇటీవల బహిర్గతం చేసింది.
విశ్రాంత న్యాయమూర్తి ఎస్ఎన్ ధింగ్రా, ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాత్సవ, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోని ఇతర సభ్యులు నవంబర్ 14న మీడియా సమావేశంలో తమ నివేదికను విడుదల చేసారు. 64 పేజీల ఆ నివేదికలో 27మంది వ్యక్తుల సాక్ష్యాలు ఉన్నాయి. వారిలో ఏడుగురు జామియా మిలియా ఇస్లామియా టీచింగ్ స్టాఫ్, ఆరుగురు నాన్ టీచింగ్ స్టాఫ్, మిగిలిన వారు ప్రస్తుత, పూర్వ విద్యార్ధులు ఉన్నారు. వారు మతం విషయంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను కమిటీ సభ్యులకు వివరించారు.
ఆ నివేదిక, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోని సమస్యాత్మక వాతావరణాన్ని బట్టబయలు చేసింది. ప్రలోభపెట్టడం ద్వారానో, భయపెట్టడం ద్వారానో ముస్లిమేతరులను బలవంతంగా ఇస్లాంలోకి మతం మార్చే అజెండాను అమలు చేసిన తీరును లోకానికి వెల్లడి చేసింది. విద్యావకాశాలు, కెరీర్లో పురోగతి వంటి ప్రలోభాలతో కొందరిని లొంగదీసుకునే ప్రయత్నం చేసారు. మరికొందరిని భయపెట్టి, బెదిరించి మతం మార్చే ప్రయత్నం చేసారు. ఉద్యోగంలో ఉన్నవారికైతే ప్రమోషన్లు ఇస్తామని, తక్కువ పని ఉండేలా చూస్తామని వాగ్దానాలు చేసారు. వారు ఒప్పుకోకపోతే వేధించేవారు. వారు మహిళలైతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ముస్లిమేతర మహిళా సిబ్బంది లేదా విద్యార్ధులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారి వ్యక్తిగత జీవితంపై బురద జల్లడం వంటి చర్యలకు పాల్పడుతూ మతం మారితేనే వారికి రక్షణ ఉంటుందని హెచ్చరించేవారు.
హిందూమత ఆచారాలు, సంప్రదాయాలను బహిరంగంగానే దూషించే వారు. ఏం చేసినా మతం మారని వారు ఉద్యోగులైతే వారి కెరీర్‌పై రిమార్కులు రాసి ఉద్దేశపూర్వకంగా వారి ఎదుగుదలను అడ్డుకునేవారు. సాధారణ ఉద్యోగ జీవితంలోనూ అంతులేని వివక్ష ఎదుర్కొనవలసి వచ్చేది. హిందువులు నుదుట బొట్టు పెట్టుకున్నా, చేతికి కలవా (కాశీతాడు) కట్టుకున్నా తప్పే. మతం పేరిట వేధింపులు ఎదుర్కొనవలసి వచ్చేది.
జామియా మిలియాలో ఉద్యోగంలో చేరిన ఒక అవివాహితను, తోటి సీనియర్ అధ్యాపకులే ఇస్లాంలోకి మతం మారి ఒక ముస్లింను పెళ్ళిచేసుకోవాలంటూ ఒత్తిడి చేసారు. ప్రొఫెసర్ అముతుల్ హలీమ్ అనే సీనియర్ లెక్చరర్ అయితే తాము చెప్పినట్లు వినకపోతే అత్యాచారం, యాసిడ్ దాడి, హత్యకు కూడా వెనుకాడబోమంటూ బెదిరించాడని కమిటీ ముందు ఆమె చెప్పారు.
ఇలా, విచారణ పూర్తి చేసిన కమిటీ, మీడియా ముందు తమ నివేదిక విడుదల చేసిన సందర్భంలో జామియా మిలియా ఇస్లామియాలో పరిస్థితి గురించి, ‘‘మీడియా కథనాలు, పబ్లిక్ డొమెయిన్‌లో లభిస్తున్న రికార్డులు, మా విచారణలో తెలిసిన విషయాలను బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. అదేంటంటే జామియా మిలియా ఇస్లామియా జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రస్థానంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలి’’ అని వివరించారు.
కమిటీ నివేదిక బహిర్గతం చేసిన వివరాలను పరిశీలిస్తే విశ్వవిద్యాలయ వాతావరణం మొత్తం మతవివక్షతో నిండిపోయి ఉందని తెలుస్తోంది. మతమార్పిడి కోసం బలవంతపెట్టడాన్ని సహించడం మాత్రమే కాదు, అలాంటి చర్యలు వ్యవస్థీకృతమైపోయాయి. వాటి ప్రభావం విద్యార్ధులు, ఉద్యోగులు ఇద్దరిమీదా ఉంది. చదువులు చెప్పడం కంటె ముస్లిమేతరులను ప్రలోభపెట్టి లేదా భయపెట్టి మతం మార్చడమే జామియా మిలియా ఇస్లామియాలో ప్రధానమైన కార్యక్రమంగా మారిపోయింది.
Courtesy : vskts