Mohan Bhagwat |
హిందూ ధర్మం మూలాల్లోనే ప్రపంచ సంక్షేమం దాగి వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. వందనీయ డాక్టర్ ఊర్మిళా తాయి జామ్ దార్ స్మృతి వందన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పస్తుత కాలంలో ప్రపంచ సంక్షేమం కోసం హిందుత్వ ఔచిత్యం అన్న అంశంపై ప్రసంగించారు. ఆధ్యాత్మికత శాంతి కోసం ప్రపంచం నేడు భారత్ వైపే చూస్తోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రధాన సూత్రాన్ని హిందూ ధర్మం పాటిస్తోందని, ప్రపంచ సంక్షేమానికి ఇదో మార్గమన్నారు. భాతిక, ఆధ్యాత్మిక జీవితాన్ని సమతుల్యం చేయడంలో మానవాళికి మార్గనిర్దేశం చేసేందుకు భారత్ తన ప్రాచీన జ్ఞానాన్ని పునరుద్ధరించాలని ఆయన పిలుపునిచ్చారు.
మన దేశంలో శాస్త్రీయ పురోగతి, భౌతిక విజయాలు పెరిగినా.. పాశ్చాత్య కోణంలో జరిగిన అభివృద్ధి అసంపూర్ణంగానే వుందన్నారు. మతం, రాజకీయాలు వ్యాపార వస్తువులుగా మారిపోయాయన్నారు. దీని తర్వాత శాస్త్రీయ యుగం వచ్చినా, అది కూడా ఆయుధ వ్యాపారంగా మారిందన్నారు. దీంతో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయని, ఈ కోణం నుంచి చూసినా... ఆనందం, శ్రేయస్సు కంటే విధ్వంసమే ఎక్కువగా జరిగిందని వాపోయారు. ప్రపంచం మొత్తం నాస్తికత్వం, ఆస్తికత్వం అన్న ధ్రువాలుగా విభజన జరిగిందని, అది కాస్త సంఘర్షణగా మారిపోయిందన్నారు. ఈ సంఘర్షణలో బలవంతులే జీవిస్తారని, బలహీనులు చనిపోతారన్నారు. సామూహిక ఆలోచన అన్నది ముందుకు వచ్చినా... ఆ తర్వాత పోరాటాలు ప్రారంభమయ్యాయని, వనరులు కూడా అపరిమితంగా వున్నా... మార్గాలు మాత్రం కనుగొనబడలేదన్నారు. నేడు ఆధ్యాత్మిక శాంతి కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు.
ప్రపంచం వనరులతో సమృద్ధిగానే వుందని, అపరిమిత జ్ఞానాన్ని కలిగి ఉందని, అయితే మానవాళికి అవసరమైన సంక్షేమ మార్గం లేదని అన్నారు. ఈ విషయంలో భారతదేశం సంపన్నమైనది. కానీ నేడు భారత్ జ్ఞానాన్ని మరచిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, వాటిలో ఒకటి సుఖాలు మరియు ప్రశాంతమైన జీవితం కావాలని కోరుకోవడమేనన్నారు. కానీ... గతంలో ఏం చేశామో గుర్తు తెచ్చుకోవాలని, విస్మృతి అన్న గొయ్యి నుంచి బయటపడాలని సూచించారు.
భారతీయ తత్వశాస్త్రంలో అవిద్య, విద్య రెండింటిలోనూ మహత్వం వున్నదన్నారు. అందుకే భౌతిక, ఆధ్యాత్మికత అన్న రెంటి మధ్య సమతుల్యత అవసరమని అభిప్రాయపడ్డారు. భౌతికత, ఆధ్యాత్మికత రెండింటి మధ్య సంబంధం కూడా వుందని విషదీకరించారు. అందుకే ఇక్కడ ఉన్మాదత్వం లేదన్నారు. అయితే.. పశ్చిమ దేశాల సరళి కారణంగా మతోన్మాదం, అతివాదం రెండూ కనిపిస్తున్నాయని వివరించారు. వారు స్వార్థాన్ని విడిచిపెట్టలేకపోతున్నారని, అందుకే వారి దృష్టికోణం అసంపూర్ణంగా వుందన్నారు. మానవ ధర్మమే సనాతన ధర్మమని, సనాతన ధర్మమే హిందూ ధర్మమని తెలిపారు. ఇవన్నీ ఒకే దృష్టికోణంలో చూడాలని, భిన్నత్వంలో ఏకత్వం అనేది విశ్వానికే ఓ సందేశమని సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.