మత మార్పిడి విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందుయేతర మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే హిందువులుగా పేర్కొనడం తప్పని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇది రాజ్యాంగాన్ని మోసగించడమే అవుతుందని తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల ధ్రువీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్. మహాదేవన్ ధర్మాసనం 21 పేజీల తీర్పులో తప్పుబట్టింది.
ఇలా చేయడం కోటా విధానం ప్రాథమిక, సామాజిక లక్ష్యాలను బలహీనపరిచినట్లే అవుతుందని తెలిపింది. అలా చేయడం బలహీన వర్గాల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల విధానాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, అది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని అభిప్రాయపడింది.
సెల్వరాణి అనే మహిళ హిందూ తండ్రి, క్రైస్తవ తల్లికి జన్మించింది. పుట్టిన కొన్నిరోజులకే బాప్టిజం తీసుకొని, క్రైస్తవాన్ని ఆచరిస్తున్నది. 2015లో పుదుచ్చెరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేందుకు తన తండ్రి కులమైన వెల్లువన్గా తనకు ఎస్సీ సర్టిఫికెట్ జారీ చేయించాలని ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె వినతిని హైకోర్టు జనవరి 24న తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
”భారత్ లౌకిక దేశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. ప్రతి పౌరుడు తమకి నచ్చిన మతాన్ని ఆచరించడానికి, ప్రకటించడానికి హక్కు ఉంది. వేరే మతంలోకి మారవచ్చు. అయితే దాని సూత్రాలు, సిద్ధాంతాల ద్వారా నిజమైన ప్రేరణ పొందినపుడు వేరే మతంలోకి మారవచ్చు. కానీ రిజర్వేషన్ ప్రయోజనాల కోసం మాత్రమే మతం మారడాన్ని అనుమతించలేము. ఇది రిజర్వేషన్లకు వ్యతిరేకం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే” అని జస్టిస్ పంకజ్ మిథాల్, ఆర్.మహదేవన్ల ధర్మాసనం పేర్కొంది.
పిటిషనర్ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూనే ఉన్నారని, ఆమె తిరిగి హిందూ మతంలోకి మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ తండ్రి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి అయినా తర్వాత క్రిస్టియన్గా మతం మార్పినట్లు డాక్యుమెంటరీ ఆధారాల ద్వారా స్పష్టమైనట్లు న్యాయస్థానం తెలిపింది. పిటిషనరకు వ్యతిరేకంగానే సాక్ష్యాలు ఉన్నాయని, కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసమే మత మార్పిడి చేసుకున్నట్లుగా అర్థమవుతుందని పేర్కొంది. అందుకే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు అనుమతించమని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది.
ఈ కేసులో ఇచ్చిన 21 పేజీల తీర్పులో సుప్రీంకోర్టు కీలక విషయాలను పేర్కొన్నది. ‘మతంపై నిజమైన విశ్వాసం లేకుండా, కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందేందుకు మతం మారడాన్ని అనుమతించలేం. ఇలాంటి నిగూఢ ఉద్దేశాలు కలిగిన వ్యక్తులకు రిజర్వేషన్ల ప్రయోజనాలు అందడం అంటే రిజర్వేషన్ల విధాన లక్ష్యాన్ని ఓడించడమే అవుతుంది.’ అని ధర్మాసనం పేర్కొన్నది.
ఉద్యోగం కోసమే పిటిషనరు హిందువుగా చెప్పుకొని ఎస్సీ సర్టిఫికెట్ అడుగుతున్నారని, బాప్టిజం తీసుకున్న తర్వాత ఆమె హిందువుగా గుర్తింపును పొందలేరని కోర్టు స్పష్టం చేసింది. ఆమె ఇప్పటికీ క్రైస్తవాన్ని ఆచరిస్తున్నారనే విషయం చర్చి అటెండెన్స్ ద్వారా స్పష్టమవుతున్నదని, కాబట్టి హిందువుగా ఆమె చేస్తున్న వాదనను సమర్థించలేమని పేర్కొన్నది.
క్రైస్తవంలోకి మారే వారు తమ కుల గుర్తింపును కోల్పోతారని, ఒకవేళ వారు ఎస్సీ ప్రయోజనాలు పొందాలనుకుంటే మళ్లీ మతం మారినట్టు కచ్చితమైన ఆధారం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్ ఏ కార్యక్రమంలో లేదా ఆర్యసమాజ్ ద్వారా మళ్లీ హిందూ మతాన్ని స్వీకరించలేదని, ఆమె ఇప్పటికీ క్రైస్తవాన్ని పాటిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నది. ఈ పిటిషన్ను కొట్టేసింది.