Central government issues notice to Wikipedia |
వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు
వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వికీపీడియాలో లభించే సమాచారం పక్షపాతంగా వుందని, తప్పుడు సమాచారం వుందన్న ఫిర్యాదులతో కేంద్రం ఈ నోటీసులిచ్చింది.కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నోటీసులిచ్చింది.
అందులో పక్షపాత ధోరణితో సమాచారం అందిస్తున్నారని, అలాగే తప్పుడు సమాచారాలు కూడా వుంటున్నాయని కొందరి నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వచ్చాయి. అయితే... సమాచారం అందించే విషయంలో తమను కేవలం మధ్యవర్తులుగానే చూడాలన్న వికీపీడియా వాదనను కేంద్రం తప్పుబట్టింది. ఆన్ లైన్ ఫ్రీ ఎన్ సైక్లోపీడియాలోనే వ్యాసాలు ప్రచురితం అవుతున్నాయని, అందుకే పబ్లిషర్ గా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని కేంద్రం సూటిగా ప్రశ్నించింది. చిన్న సంపాదకులకు, సంస్థలకు కంటెంట్ పై ఎడిటోరియల్ నియంత్రణ వుంటుందని, వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని నిలదీసింది.
ప్రస్తుతం వికిపీడియా, ఏఎన్ఐ (ఏషియన్ న్యూస్ నెట్వర్క్) మధ్య కేసు నడుస్తోంది. ఏఎన్ఐను ప్రభుత్వ ప్రాపగాండా టూల్ అని వికిపీడియాలో కొందరు యూజర్లు అభివర్ణించారు. తమ సంస్థ గురించి వివరించిన పేజీలో ‘ఫేక్ వెబ్సైట్స్ నుంచి రెచ్చగొట్టే వివరాలను తీసుకొని ప్రచురిస్తుంది’ అని ఉన్నట్లు ఏఎన్ఐ తెలిపింది. దీనిపై కోర్టుకెక్కిన ఏఎన్ఐ.. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. తమ సంస్థ గురించి ఉన్న వికిపీడియా పేజిని తొలగించాలని, తమ సంస్థపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న యూజర్ల వివరాలను తమకు తెలియజేయాలని డిమాండ్ చేసింది.
ఎన్ఐఏ పేజీకి సంబంధించిన సవరణల విషయానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తన ఉత్తర్వును పాటించనందుకు విసిగిపోయిన కోర్టు.. భారత్ లో వికీపీడియాను బ్లాక్ చేయమని కేంద్రాన్ని అభ్యర్థిస్తామని కూడా కోర్టు హెచ్చరించింది. తాజాగా నవంబర్ 1 న జరిగిన తాజా విచారణలో న్యాయస్థానం వికీపీడియా ఉచిత ఎన్ సైక్లోపీడియా అన్న వాదనను సవాలు చేసింది.