ఉస్మానియా యూనివర్శిటీలో విదేశీ విద్యార్థులతో దీపావళి మిలన్ ఘనంగా జరిగింది. జి. రాంరెడ్డి దూర విద్యా కేంద్రంలో వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ సంస్థ (WOSY) ఆధర్వంలో ఇది జరిగింది. 45 దేశాలకు చెందిన 450 మంది విదేశీ విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎం. కుమార్, యూనివర్శిటీ విదేశీ వ్యవహారాల డైరెక్టర్ ఆచార్య శివరామ కృష్ణ, ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ రాజ్‌తో పాటు WOSY మాజీ అంతర్జాతీయ కార్యదర్శి మహ్మద్ ఆల్ఫా పాల్గొన్నారు. దీపావళి ప్రాశస్త్యాన్ని తెలుపుతూ సాగిన ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. భారతీయ ఆచారాల గొప్పతనాన్ని, వైవిధ్యతను ప్రపంచానికి వివరించే విధంగా ఈ కార్యక్రమం సాగింది.
WOSY అంతర్జాతీయ మాజీ కార్యదర్శి మహ్మద్ ఆల్ఫా ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. భారత దేశ ఆతిథ్యం ఎలా వుంటుందో, మతపరమైన సహనాన్ని భారతీయులు ఎలా ఆచరిస్తారన్న అంశాలతో పాటు భారతీయ పండుగలలో వుండే విలక్షణతను ఈ సందర్భంగా ప్రశంసించారు. అన్ని నేపథ్యాల ప్రజలను ఒక చోట చేర్చే విధానంతో పాటు అన్ని మతాలను సమానంగా గౌరవించే అనుభవం ఇక్కడ చూసినట్లు తెలిపారు.
ఉస్మానియా యూనివర్శిటీ ఉపకులపతి ఎం. కుమార్ మాట్లాడుతూ... భారతీయ సంస్కృతితో అంతర్జాతీయ విద్యార్థులను అనుసంధానించే కార్యక్రమం అద్భుతంగా వుందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. విదేశీ విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారికి మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం చేస్తున్న పనులు, కృషిని ఈ సందర్భంగా వివరించారు. ఇలా అన్ని నేపథ్యాల విద్యార్థులను అనుసంధానించడం ద్వారా సాంస్కృతిక సంబంధాలు పెంపొందుతాయని, ఈ లక్ష్యం కోసం పనిచేస్తున్న WOSYని అభినందించారు.
యూనివర్శిటీలోని విదేశీ వ్యవహారాల డైరక్టర్ ఆచార్య శివరామకృష్ణ మాట్లాడుతూ... అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్వాహకులను ప్రశంసిస్తూ ధన్యవాదాలు తెలిపారు. అందరూ ఇక్కడికి రావడంతో సాంస్కృతిక ఐక్యత వెల్లివిరిసిందన్నారు.
వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ (WOSY) అంతర్జాతీయ సెక్రెటరీ, జాతీయ కన్వీనర్ నిఖిత రెడ్డి మాట్లాడుతూ... వసుధైవ కుటుంబం అన్న స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా హిందువులను ఏకం చేయడంపై మాట్లాడారు. అలాగే హైదరాబాద్ శాఖ చేస్తున్న పనులు, నిబద్ధతను వివరించారు. ఈ సంస్థ 1985 లో స్థాపించబడిందని, దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో వుందన్నారు. ఇప్పుడు భారత్‌లో 20 శాఖలున్నాయని, విద్యార్థుల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడంపై దృష్టి పెడుతున్నామని వివరించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న దానిని తాము నమ్ముతామని, ఇది పురాతన శాస్త్రాల్లో కూడా వుందన్నారు. సాంస్కృతికంగా ఏకీకరణ చేయడంపై, సామరస్య ప్రపంచాన్ని సృష్టించడానికి తమ ప్రయత్నాలు సాగుతాయని తెలిపారు.
ఈ విభిన్నమైన కార్యక్రమం ప్రేక్షకులను, విదేశీ విద్యార్థులను విశేషంగా ఆకర్షించింది. హైదరాబాద్‌లోని వివిధ క్యాంపస్‌లలో చదువుతున్న విదేశీ విద్యార్థులందరూ హాజరయ్యారు. భిన్నమైన సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు, ముఖ్యంగా మధ్య ప్రాచ్యం, ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు దీపావళి మిలన్ కోసం ఒక్కచోట చేరి, ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.