Waqf Amendment Bill 2024 |
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు 2024
ఈనెల 25 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’ చర్చకు రానుంది. లోక్ సభ సచివాలయం విడుదల చేసిన బులిటెన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్టు 8న సభ ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఆ మరుసటి రోజు జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం చివరి రోజు కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించా లని ఇదివరకే నిర్దేశించారు. అందువల్ల జాయింట్ కమిటీ తన నివేదికను 29లోపు సభ ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లుపై సభలో చర్చించి ఆమోదించనున్నారు.
దీంతోపాటు 1. డిజాస్టర్ మేనేజ్మెంట్ (అమెండ్మెంట్ బిల్లు), 2. రీఅడ్జ స్ట్మెంట్ ఆఫ్ రెప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ గోవా బిల్లు, 3. ముసల్మాన్ వక్స్ (రిపీల్) బిల్లు, 4. బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లు, 5. క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, 6. రైల్వేస్ (అమెండ్మెంట్) బిల్లు, 7. బ్యాంకింగ్ లాస్ (అమెండ్మెంట్) బిల్లులను సభ ముందుంచి పాస్ చేయనున్నారు. ఈ బిల్లులన్నింటినీ గత ఆగస్టులోనే సభలో ప్రవేశపెట్టినట్లు లోక్ సభ సచివాలయం పేర్కొంది. అలాగే కొత్తగా 5 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు.