Dhirendra Krishna Shastri |
బాగేశ్వర్ ధామ్ కి చెందిన పండిత ధీరేంద్ర కృష్ణశాస్త్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. హిందువులందరూ తమ మతం, ఆచారం, ధర్మాచరణ విషయంలో అత్యంత సీరియస్ గా వుండాలని సూచించారు.
హిందువుల్లోనే కొందరు మన మతాన్ని ఎగతాళి చేయడానికి సిద్ధమైపోయారని, ఇలా చేయడానికి వెనుకంజ కూడా వేయడం లేదన్నారు. కానీ.. ఇతర మతాల్లో మాత్రం ఇలా లేదన్నారు. ముస్లింలు తమ మత గురువులను ఎప్పుడూ అవమానించరని, కానీ హిందువులు వారి మతాచార్యులను, పద్ధతులను, తీర్థయాత్రలను ఎగతాళి చేస్తున్నారని వాపోయారు. ఇలా జరగకూడదని హితవు పలికారు. తాను ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అయితే.. హిందువులు మా్రం తమ సంప్రదాయాలను, ధర్మాన్ని గౌరవించడం చాలా ముఖ్యమని సూచించారు.
మరోవైపు రోజురోజుకీ హిందువుల్లో కొందరు పనిగట్టుకొని తప్పుడు భావాలను నింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దీంతో ఆచారాలు, సంప్రదాయాలు జోక్ గా తయారయ్యాయని అన్నారు. మన విధానాలను వక్రీకరించి, తప్పుడు మూలాలను నింపుతున్నారని, దీంతో మన ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించేవారు తగ్గుతున్నారని అన్నారు. ఇప్పుడున్న సంప్రదాయాలు, ధర్మం అంతా కూడా మన పూర్వీకులు ఆచరించి చూపారని, దీనిని మరిచిపోవద్దన్నారు.
ఆచారాలంటే కేవలం ఆచారాలు మాత్రమే కావని, అవి మన గుర్తింపులో భాగమని హితవు పలికారు. మన సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని, అందరూ ముందుకు రావాలన్నారు. కులతత్వం, మతతత్వానికి అతీతంగా అందరూ ఎదగాలన్నారు. ఇందుకు గాను హిందూ సమాజం సంఘటితం కావాలన్నారు.