శ్రీ సత్య సాయి జిల్లా పామిడిలో ఘాతుకం జరిగింది.పెన్నానదిలో వెలసిన సీతారామలక్ష్మణ సమేత భక్తాంజనేయస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామి మూలవిరాట్ను దుండగులు అపహరించుకెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఉదయం ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లిన సమయంలో అర్చకుడు అమరనాథ్ గుర్తించి విషయాన్ని ఆలయ ధర్మకర్తలు ఎ శ్రీనివాసులు, ఎ షణ్ముఖ కుమార్కు తెలిపారు.
ఈ సందర్భంగా షణ్ముఖ కుమార్ మాట్లాడుతూ.. 1938లో తమ పూర్వీకుడు మోటార్ బాలన్న.. పెన్నానదిలో స్నానం ఆచరిస్తున్న సమయంలో లభించిన సీతారామలక్ష్మణ విగ్రహాలను అక్కడే ప్రతిష్టించి ఓ ఆలయాన్ని నిర్మించారని, దీని ఎదురుగానే మరో ఆలయాన్ని నిర్మించి భక్తాంజనేయస్వామి రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారని గుర్తు చేశారు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో కావాలనే ఈ పనిచేశారని, వెంటనే దుండగులను గుర్తించి, శిక్షలు వేయాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రిందటే అనంతపురం జిల్లాలో అపచారం జరిగింది. కనేకల్ మండలం, హనకనహల్ లో గుర్తు తెలియని వ్యక్తులు రామాలయం రథానికి నిప్పు పెట్టారు. దుండగులు అర్ధరాత్రి రామాలయానికి వచ్చి, రథానికి నిప్పు పెట్టారు. మళ్లీ ఇప్పుడు ఈ ఘటన జరిగిందని మండిపడుతున్నారు.