Mohan Bhagwat |
సంఘ కార్యంతో పోల్చదగిన కార్యం ప్రపంచంలో లేదు : మోహన్ భాగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ రాజస్థాన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి దేవాలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత స్వయంసేవకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఈ సందర్భంగా నిత్య శాఖ గురించి వారు వివరించారు. నిత్య శాఖతో సమాజాన్ని అనుసంధానించాల్సిన అవసరం వుందన్నారు. నిత్య శాఖ ద్వారా సమాజ అవసరాలను తీర్చడానికి సమర్థులైన స్వయంసేవకులు తయారవుతారని వివరించారు. అలాగే హిందూ సమాజం తీరుతెన్నుల గురించి చర్చించారు. హిందూ సమాజ భద్రత కోసం అన్ని విభేదాలనూ పక్కనపెట్టి, హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రాంతం, భాష, కులం అన్న విభేదాలను తొలగించుకొని, హిందూ సమాజం సంఘటితం కావాలని, అలాంటి సద్భావన, సాహిత్యం రావాలని ఆకాంక్షించారు.
ఇక... దేశం పట్ల తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం సమాజంలో క్రమశిక్షణ, సత్ప్రవర్తనను నిర్దేశించే గుణాలు సమాజంలో అవసరమన్నారు. తాము, తమ కుటుంబం అనే కాకుండా యావత్ సమాజం పట్ల శ్రద్ధ వహించాలని, ఈ గుణాల ద్వారా ఈశ్వరుడ్ని చేరాలని సూచించారు. భారత్ హిందూ దేశమని, ఈ హిందూ అన్న పదాన్ని హిందువులందరికీ ఉపయోగించారన్నారు. ‘‘భారత్ హిందూ దేశం. అత్యంత పురాతన కాలం నుంచి ఇక్కడ నివసిస్తున్నాం. హిందూ అన్న పదాన్ని భారతీయులందరికీ వర్తింపజేశారు. హిందువులు అందర్నీ తమవారిగా భావిస్తారు. అందర్నీ అంగీకరిస్తారు.’’ అని పేర్కొన్నారు.
Mohan Bhagwat |
సంఘ కార్యం యాంత్రికమైంది కాదని, సైద్ధాంతిక పునాదులతో కూడుకున్నదని మోహన్ భాగవత్ వివరించారు. సంఘ కార్యంతో పోల్చదగిన కార్యం ప్రపంచంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. సంఘంలో విలువలనేవి సంఘ అధికారుల నుంచి స్వయంసేవక్ కి వెళ్తాయని, అక్కడి నుంచి స్వయంసేవకుల కుటుంబాలకు చేరుతాయని, సంఘ్ లో వ్యక్తిత్వ వికాసానికి ఇదే పద్ధతి వుంటుందన్నారు.