కేరళలో వక్ఫ్ బోర్డుకి హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత
వక్ఫ్ బోర్డుకి హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేరళలోని మునంబం బీచ్ వద్ద భూమిని లాగేసుకోడానికి వక్ఫ్‌బోర్డ్ చేస్తున్న ప్రయత్నాల మీద తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలు, హిందూ సంస్థలు వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. బీచ్ దగ్గరి ప్రభుత్వ భూమి స్థితి గురించి వక్ఫ్ బోర్డ్ వాకబు చేస్తుండడంపై స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. బోర్డ్ తమను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోందంటూ మండిపడుతున్నారు. తాము వక్ఫ్ భూములనే కాక ప్రభుత్వభూములను సైతం ఆక్రమించుకుంటూ, చట్టాలను ఉల్లంఘిస్తున్నామని తమ మీద ఆరోపణలు చేయడానికి బోర్డ్ ప్రయత్నిస్తోందని స్థానికులు బాధపడుతున్నారు.
కొద్దిరోజుల క్రితం వక్ఫ్ ప్రతినిధులు మునంబం ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. భూములకు సంబంధించిన అధికారిక పత్రాల గురించి ప్రస్తావించారు. దాంతో స్థానిక మత్స్యకార జనాభాలో ఆందోళన ఎక్కువైంది. కొన్ని దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న తమ భూములు లాగేసుకుంటారని వారు భయపడుతున్నారు.
వక్ఫ్‌బోర్డ్ కొత్తగా భూములను ఆక్రమించడానికి చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 1950లో ఫరూఖ్ కాలేజీకి అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూములు 2022లో వక్ఫ్‌బోర్డ్ పరిధిలోకి ఎలా వస్తాయని స్థానిక ప్రజలు, ముస్లింలూ ప్రశ్నిస్తున్నారు. కేరళలో ఓబీసీలైన ఎళవ కులానికి ప్రతినిధులైన శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం (ఎస్ఎన్డిపి అనే సంస్థ) ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. మునంబం ప్రాంతవాసులు 1989 నుంచీ పన్నులు కడుతూ చట్టబద్ధంగా నివసిస్తున్న ప్రాంతాన్ని ఖాళీ చేయించే ప్రయత్నాలను తప్పుపడుతూ ఆందోళన చేపట్టింది.
కుట్ర ఆరోపణలు:
స్థానిక మత్స్యకారుల నుంచి భూమిని గుంజేసుకోవాలన్న మహాకుట్రలో భాగంగా వక్ఫ్‌బోర్డ్ ప్రయత్నిస్తోందంటూ ‘భారతీయ మత్స్య ప్రవర్తక సంఘం’ ఆరోపణలు చేసింది. ఫరూఖ్ కాలేజీ యాజమాన్యానికి మునంబం నివాసులకూ మధ్య కొన్నాళ్ళుగా రెండు కేసులు నడుస్తున్నాయి. వారు పరస్పరం పరిచయం ఉన్నవారే అవడం విశేషం. అందుకే వారు కోర్టు బైట సెటిల్ చేసుకున్నారు. తద్వారా భూమికి మత్స్యకారుల ప్రేమాభిమానాలు, ఆ భూమి మీద తమ హక్కులూ వస్తున్నాయి.
‘భారతీయ మత్స్య ప్రవర్తక సంఘం’ అధ్యక్షుడు పి పీతాంబరం రాష్ట్రప్రభుత్వపు వివరణ మీద మండిపడ్డారు. వక్ఫ్‌బోర్డ్ ఆ ఆశ్రమం ఆవరణలో ఉన్నందున దానిపై యాజమాన్య హక్కులు బోర్డ్‌కే ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారం తీవ్రత దృష్ట్యా కేంద్ర రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలన్నారు.
హిందూ ఐక్య వేది సంస్థ కూడా వక్ఫ్‌బోర్డ్ చర్యలను తీవ్రంగా ఖండించింది. చేరై ప్రాంతంలో గత 35 ఏళ్ళుగా నివసిస్తూ, ప్రభుత్వానికి పన్నులు కడుతూన్న సుమారు 610 పల్లెకారుల కుటుంబాలను అక్కడినుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వక్ఫ్ బోర్డ్ చర్యలను తప్పుపట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వక్ఫ్ చట్టానికి దేశవ్యాప్తంగా సవరణలు చేయాలని డిమాండ్ చేసింది. గత 35ఏళ్ళుగా భూమిశిస్తులు కడుతున్న కుటుంబాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి, వాటిని రక్షించుకోవాలని పిలుపునిచ్చింది. ఈ వ్యవహారంలో వక్ఫ్‌బోర్డ్ దుర్మార్గ వైఖరి మీద వరుసగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది.