రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ ఈ నెల 25,26 తేదీల్లో జరుగుతుందని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్ మథురలోని గౌ గ్రామ్ పర్ఖామ్ లో జరగనున్నాయి. మథురలోని గౌగ్రామ్ పర్ కామ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సునీల్ అంబేకర్ మాట్లాడారు. సంఘ్ సంస్థాగత కార్యకలాపాలను సమీక్షించడం, దేశానికి సంబంధించిన ముఖ్య విషయాలను చర్చించడానికి వేదిక కానుంది. సంఘ్ 1925 లో స్థాపించబడిందని, గత 99 సంవత్సరాలుగా సంఘ్ వ్యక్తి నిర్మాణం పైనే పనిచేస్తోందని, దీని ద్వారా దేశ నిర్మాణం చేస్తోందని తెలిపారు. 2025 విజయ దశమి నాటికి సంఘ్ కి 100 సంవత్సరాలు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఈ స్పష్టమైన లక్ష్యంతో సంఘ్ దేశ వ్యాప్తంగా విస్తరించిందని, కార్యకలాపాలు కూడా దేశంలోని అన్ని రంగాల్లోనూ వున్నాయన్నారు.
ఈ సమావేశాల్లో సంఘ్ ను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్న సంస్థల కార్యకలాపాలు, విస్తరణ, ప్రణాళికలపై చర్చిస్తామని అంబేకర్ వెల్లడించారు. ఈ సమావేశాలకు సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళేతో పాటు కార్యకారిణి సభ్యులందరూ హాజరవుతారని పేర్కొన్నారు.వీరితో పాటు ప్రాంత ప్రచారకులు, ప్రాంత సహప్రాంత ప్రచారకులు, ప్రాంత సంఘచాలకులు, ప్రాంత కార్యవాహలతో పాటు ప్రాంత సహ కార్యవాహలు కూడా పాల్గొంటారు. దాదాపు 393 మంది సదస్యులు ఇందులో పాల్గొంటారు.
వచ్చే విజయదశమి నాటికి సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, ఈ సందర్భంగా రానున్న రోజుల్లో సంఘ్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? దేశ వ్యాప్తంగా నిర్వహించబోయే కార్యకలాపాలపై చర్చ ఈ సమావేశాల్లో వుంటుంది. అలాగే ఈ విజయదశమి సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భాగవత్ చేసిన ప్రసంగంపై కూడా లోతైన చర్చ వుంటుందని, అలాగే సమాజాన్ని ఏకత్రీకరణ చేయడంపై కూడా చర్చలు సాగుతాయని అంబేకర్ పేర్కొన్నారు.ఈ ప్రసంగంలో సరసంఘచాలక్ పిల్లలపై ఇంటర్నెట్ ప్రభావం, ఇంటర్నెట్ విషయాలు ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయో కూడా ప్రస్తావించారని గుర్తు చేశారు.
ఈ అంశాలతో పాటు దయానంద సరస్వతీ, బిర్సాముండా, అహల్యాబాయి హోల్కర్, రాణి దుర్గావతి, పూజ్య సంత్ అనుకూల్ చంద్ర ఠాకూర్ సందేశాలను సమాజంలో ఎలా వ్యాప్తి చేయాలన్న దానిపై కూడా చర్చలుంటాయని, అయితే... ఈ అంశాలను సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ఇప్పటికే వారి విజయదశమి ప్రసంగంలో స్పృశించారని గుర్తు చేశారు.
అలాగే ఒడిశా, గుజరాత్ తో పాటు పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయని, ఈ క్లిష్ట సమయాల్లో స్వయంసేవకులు ముందుకు వచ్చి, సమాజానికి సేవలందించారని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన సమీక్షలు కూడా జరుగాయని, రాబోయే కాలంలో స్వయంసేవకులు ఏం చేయాలో కూడా సమాలోచిస్తామని తెలిపారు. సరసంఘచాలక్ మోహన్ భాగవత్ పర్యటనలు, సర్ కార్యవాహ్ పర్యటనలతో పాటు అఖిల భారతీయ అధికారుల పర్యటనల సమాలోచనలు, వాటిని ఖరారు చేయడం కూడా జరుగుతుందన్నారు.
ఇక... నవంబర్, డిసెంబర్ లో 25 రోజుల పాటు నాగపూర్ కేంద్రంగా జరగబోయే కార్యకర్త వికాసవర్గ ద్వితీయ విశేష్ గురించి, కరోనా మహమ్మారి తర్వాత జరగడం ఇదేనని, దీనిపై కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. చివరగా పాలక్కడ్ వేదికగా జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభలో చర్చించన అంశాలపై కూడా సమీక్ష వుంటుందని సునీల్ అంబేకర్ ప్రకటించారు.