ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పద మృతి... పొదల్లో మృతదేహం |
ఢిల్లీలో ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఢిల్లీలోని నరేలా జిల్లా కార్యవాహగా జితేంద్ర కుమార్ భరద్వాజ పనిచేస్తున్నారు. ఆయన మృతదేహం లభ్యంకావడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ఎవరో కక్షతోనే చంపేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే.. అది ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ కేసును ఛేదించడానికి పలు పోలీసు బృందాలను అధికారులు నియమించి, దర్యాప్తును ప్రారంభించారు. బోర్ఘర్ ప్రాంతంలో భరద్వాజ్ మృతదేహం లభ్యం కావడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఆరెస్సెస్ ముఖ్య సమావేశానికి హాజరు కావడానికి ఇంటి నుంచి సాయంత్రం బయల్దేరాడు. కానీ... రాత్రి 7:48 ప్రాంతంలో ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. అప్పటి నుంచి కుటుంబీకులతో ఆయనకు సంబంధాలు లేవు. దీంతో కుటుంబీకులు భరద్వాజ్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వెతకాలని కోరారు. కానీ సోమవారం ఉదయం అతని మృతదేహం రైల్వే ట్రాక్ సమీపంలో కనిపించింది. దీంతో పోలీసులు విచారణ కోసం మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. ఈ ఘటనపై భరద్వాజ కుటుంబీకులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహానికి కొద్ది దూరంలోనే జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లాకు చెందిన ఓ ముస్లిం వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు, లైసెన్స్ దొరికాయి. అంతేకాకుండా భరద్వాజ మృతదేహాన్ని దుండగులు రైల్వే ట్రాక్ సమీపంలోని పొదల్లో దాచిపెట్టారు. దీంతో అనుమానాలు మరింత బలమవుతున్నాయి. పోస్టుమార్టం తర్వాత పోలీసులు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.