Rashtra Sevaika Samithi |
మహిళా స్వావలంబనే లక్ష్యంగా రాష్ట్ర సేవికా సమితి
(విజయదశమి – రాష్ట్ర సేవిక సమితి ఆవిర్భావ దినోత్సవం)
ఆర్.ఎస్.ఎస్ అంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ …ఈ పేరు నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిందే. ప్రతి విజయదశమికి ఆర్.ఎస్.ఎస్. తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే ఈ విజయదశమి రోజునే మరొక సంస్థ కూడా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. అదే రాష్ట్ర సేవికా సమితి. ఆర్.ఎస్.ఎస్.తో సమానంగా సమాజకార్యం చేస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని నిలపడానికి కృషి చేస్తోంది. ఈ సంస్థ స్త్రీవాదం సూత్రాన్ని కాకుండా ఫ్యామిలిజం అంటే కుటుంబ భావనను అనుసరిస్తోంది. అందుకే మహిళలు దేశానికి మూలస్తంభం అన్నది రాష్ట్ర సేవికా సమితి ప్రగాఢ విశ్వాసం.
రాష్ట్ర సేవికా సమితి - Rashtra Sevika Samiti |
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 1925 విజయదశమి నాడు ప్రారంభం కాగా 1936లో అదే విజయదశమి నాడు రాష్ట్రీయ సేవికా సమితి మహారాష్ట్రలోని వార్ధలో ప్రారంభం అయింది. ఆ సమయంలో మహిళలకు విద్య సంగతి అటుంటితే వారిని గడప దాటించేవారు కూడా కాదు. అటువంటి స్థితిలో ఉన్న హిందూ మహిళలను స్వావలంబన దిశగా ఎలా నడపాలని ఒక మహిళ ఆలోచించింది. హిందూ మహిళలు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు తమ పిల్లలకు కూడా మంచి విలువలు నేర్పించగలరు. అలాగే దేశాభివృద్ధిలో, సమాజాభివృద్ధిలో తోడ్పడగలరని ఆ మాతృమూర్తి నమ్మింది. ఆవిడే లక్ష్మీబాయి కేల్కర్. అందరూ ఆమెను గౌరవంగా ‘‘మౌసీ జీ’’ అని పిలుస్తారు.
భారతీయ మహిళా సంస్కృతి, సంప్రదాయాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న రాష్ట్ర సేవిక సమితి ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ మహిళా సంస్థ. రాష్ట్ర సేవిక సమితి 5215 శాఖల ద్వారా సుమారు 10 లక్షల మంది మహిళలను కలుపుతోంది. ఈ సంస్థ తన శాఖలను ప్రపంచంలోని 10 దేశాలలో నిర్వహిస్తోంది. ఆయా దేశాల్లో ఈ సంస్థను ‘‘హిందూ సేవిక సమితి’’ అనే పేరుతో పిలుస్తారు. ఆర్.ఎస్.ఎస్. తరహాలోనే రాష్ట్ర సేవిక సమితి కూడా పని చేస్తోంది. ఆత్మ రక్షణ కోసం స్వయంసేవ, మహిళల అభ్యున్నతి కోసం స్వయం సహాయక బృందాలు, సాహిత్య కేంద్రాలు, సంస్కార కేంద్రాలు, ఉచిత అధ్యయనాలు ఇలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేశంలోని మహిళల అభ్యున్నతి కోసం పాఠశాలలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు, అనాథాశ్రమాలతో సహా 475 ప్రాజెక్టులను నడుపుతోంది.
Rashtra Sevika Samiti |
ఆర్.ఎస్.ఎస్. వ్యవస్థాపకులు పరమ పూజనీయ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌తో సంప్రదించిన తరువాత లక్ష్మీబాయి కేల్కర్ రాష్ట్ర సేవికా సమితిని స్థాపించి 1978 వరకు దాని సంచాలికగా ఉన్నారు. స్వాతంత్ర్యానికి ముందుకాలంలో మహిళలను సమాజకార్యంలో నిమగ్నం చేయడానికి అంత అనువైన పరిస్థితులు లేవు. ఆ సమయంలో ఒక సంస్థను ఏర్పాటు చేసిన ఉక్కు మహిళ లక్ష్మీబాయి కేల్కర్. మౌసీ జీ తర్వాత సరస్వతి బాయి ఆప్టే, ఉషా తాయ్, ప్రమీలా తాయ్ సంస్థను తీర్చిదిద్దగా, శాంతక్క అని సేవికలు పిలుచుకునే వి.శాంతకుమారి ప్రస్తుతం సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. హిందూ జీవన విలువలను జీవితంలో పాటిస్తూ, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ముందుకు సాగాలని ఆమె చెబుతుంటారు. నూతన భారత్ నిర్మాణం కోసం మహిళలు ముందుకు రావాలని, అలాగే సేవికలు తమ చుట్టు పక్కల దేశభక్తిపూరిత, సకరాత్మక వాతావరణం నిర్మించాలని ఆమె చెబుతుంటారు. మహిళా ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఉన్నతాధికారిణులు ఇలా సమాజంలో వివిధ పదవుల్లో ఉన్న ఎందరో మాతృమూర్తులు రాష్ట్ర సేవిక సమితిలో సేవలు అందిస్తున్నారు. దేశంలోని యువతరాన్ని కూడా సమాజ కార్యంలో జోడించడానికి రాష్ట్ర సేవిక సమితి నిరంతరం కృషి చేస్తోంది.