Pro-Hasan Nasrallah posters |
హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా ఇజ్రాయిల్ వైమానిక దాడిలో మరణించిన తర్వాత విజయవాడ, మచిలీ పట్నంలో ఆయనకు మద్దతుగా పోస్టర్లు వెలువడ్డాయి. దీంతో ఈ ఘటన వివాదాన్ని రేకెత్తించింది. తీవ్రవాదంలో అతని ప్రమేయం వుందని విస్తృతంగా ప్రచారం జరిగిన తర్వాత కూడా పోస్టర్లు వెలువడం వివాదాన్ని రేపింది. ఈ పోస్టర్లలో ‘‘ వీ మిస్ యూ సాహెబ్’’ అని, ‘‘అతను ఉగ్రవాది కాదు మానవతావాది’’ అని, ‘‘హసన్ నస్రల్లా వ్యక్తి కాదు... ఆయన ఓ పథికుడు’’ అని వున్నాయి.
ఈ పోస్టర్లతో ఈ ప్రాంతాల్లో సామాజిక సామరస్యం దెబ్బతినడంతో పాటు తీవ్రవాదం మూలాల విషయంలోనూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హసన్ నస్రల్లా మృతికి సంతాప సూచకంగా మచిలీపట్నంలో క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఆయన గౌరవార్థం నినాదాలు చేస్తూ, పోస్టర్లు, బ్యానర్లు పట్టుకున్నారని తెలుస్తోంది.అలాగే విజయవాడ, గుంటూరులోనూ ముస్లింలు ర్యాలీలు నిర్వహించారు.
హసన్ నస్రల్లాకి భారత రాజకీయాలకి గానీ, భారతీయ ముస్లింలతో గానీ ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేనేలేవు. అయినా ఈ పోస్టర్లు ఎందుకు వెలిశాయి? అన్న దానిపై అనుమానాలు వస్తున్నాయి. ఇవి చూస్తుంటే ఎవరైనా తీవ్ర వాద కార్యకలాపాల్లో మునిగి వున్న వారు ఈ పనిచేశారా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటువంటి చర్యలు భారతదేశాన్ని అగౌరవపరచడమే కాకుండా భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ప్రమాదకరమైన ధోరణి అని విమర్శకులు పేర్కొంటున్నారు.